calender_icon.png 23 September, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవరాత్రోత్సవాల్లో అమ్మను అర్చిస్తే ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధిస్తుంది

23-09-2025 01:06:30 AM

  1. శ్రీ క్షేత్రం పీఠాధిపతి శ్రీ మధుసూదనానంద స్వామిజీ

వైభవంగా శ్రీ విద్యాధరి క్షేత్ర నవరావత్రోత్సవాలకు శ్రీకారం

గజ్వేల్, సెప్టెంబర్22: శరన్నవరాత్రి మహోత్సవ పర్వదినాల్లో జగన్మాత ప్రతిరూపాలైన శ్రీ సరస్వతి, శ్రీ దుర్గాదేవి, శ్రీ లక్ష్మీదేవిలను భక్తి శ్రద్ధలతో అర్చిస్తే ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధిస్తుందని శ్రీ క్షేత్రం పీఠాధిపతి శ్రీ మధుసూదనానంద సరస్వతి స్వామీజీ అన్నారు. ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రంలో నవరాత్ర మహోత్సవాల్లో సరస్వతి అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

కార్యక్రమంలో పాల్గొన్న స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. క్షేత్ర వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి ఆధ్యాత్మిక ప్రయాణంలో గొప్ప గొప్ప పనులకు శ్రీకారం చుట్టగా, ప్రస్తుతం ఆ పరిమళాలు ప్రతి ఒక్కరిలో దైవచింతన పెంపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా నవరాత్ర మహోత్సవ పర్వదినాలు ఆధ్యాత్మిక సాధకులకే కాకుండా లౌకిక జీవితాన్ని గడిపే ప్రతి ఒక్కరికి చక్కటి సందేశం ఇస్తుందని అన్నారు.

అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమని శ్రీ సరస్వతి మాత, శాంతి, శ్రేయస్సు కోసం శ్రీ లక్ష్మీ దేవిని ప్రార్థించాలని, అడ్డంకులు తొలగడానికి శ్రీ దుర్గామాతను సేవించాలని ఆకాంక్షించారు.

మొదటగా క్షేత్రంలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ శ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో ఆస్థాన వేద పండితులు బాల ఉమామహేశ్వర శర్మ పరివారo అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం, శ్రీ గణపతి పూజ, కలశ స్థాపన, అంకురార్పణ, చండీ హోమం, ప్రత్యేక పూజలు తదితర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రానికి విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలతో పాటు మహా ప్రసాదం అందజేశారు.