calender_icon.png 19 December, 2025 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏళ్లయినా ఏవీ చర్యలు!

19-12-2025 12:09:15 AM

  1. కోదాడలో ఏళ్లుగా మూగబోయిన ట్రాఫిక్ సిగ్నల్స్                  

వాహనదారులకు తప్పని నిత్యవేదన

ట్రాఫిక్ సిగ్నల్స్ ను పునరుద్ధరించాలంటన్న వాహనదారులు

కోదాడ, డిసెంబర్ 18 : కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తా, ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు కొన్ని సంవత్సరాలుగా సక్రమంగా పనిచేయకపోవడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సిగ్నల్స్ ప్రస్తుతం అలంకారప్రాయంగా మారి ప్రజల భద్రతకే ప్రశ్నార్థకంగా నిలుస్తున్నాయి.

పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఒకటైన ఈ చౌరస్తా మీదుగా ఖమ్మం, హైదరాబాద్, మిర్యాలగూడ వైపు వెళ్లే వాహనాల రద్దీ నిత్యం అధికంగా ఉంటుంది. ముఖ్యం గా ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్లో ట్రాఫిక్ జామ్లు సాధారణంగా మారాయి. సిగ్నల్ లైట్లు పనిచేయకపోవడంతో ఎవరి ఇష్టానుసారం వాహనాలు దూసుకెళ్తుండటంతో చిన్నపాటి ప్రమాదాలు చోటుచేసుకుంటుండగా, రోడ్డు దాటే పాదచారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొన్ని సంవత్సరాల క్రితమే ఈ కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ప్రారంభించినప్పటికీ, కొద్ది కాలానికే అవి నిర్వీర్యమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. అప్పటినుంచి మరమ్మతులు చేపట్టకపోవడం, శాశ్వత పరిష్కారం లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిగ్నల్ లైట్లు ఉన్నా ఉపయోగం లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు కూడా అరుదుగా కనిపిస్తుండటంతో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది.

తరచూ ట్రాఫిక్ గందరగోళం, వాహనదారుల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నా సంబంధిత శాఖలు మాత్రం మౌనం వహిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏళ్లుగా పనిచేయని సిగ్నల్ లైట్లను వెంటనే మరమ్మతులు చేసి పూర్తిస్థాయిలో పనిచేసేలా చేయడంతో పాటు, ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణను పెంచాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారన్న ప్రశ్నను ప్రజలు లేవనెత్తుతున్నారు.

ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలి 

రోజు రోజుకి కోదాడలో పెరుగుతున్న ట్రాఫిక్ కి అనుగుణంగా గతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ను అధికారులు ఏర్పాటు చేశారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా అవి పని చేయడం లేదు. దీంతో ట్రాఫిక్ సమస్య పట్టణంలో తీవ్రంగా ఉంది. ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ పూర్తిగా పనిచేయడం లేదు. అధికారులు స్పందించి ట్రాఫిక్ సిగ్నల్స్ ని పునరుద్ధరించి ట్రాఫిక్ తో ఇబ్బందులు లేకుండా చూడాలి.

- బషీరుద్దీన్ (సామాజిక ఉద్యమకారుడు కోదాడటౌన్