12-07-2025 12:07:01 AM
న్యూఢిల్లీ, జూలై 11: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశా రు. నాగ్‌పూర్‌లో శుక్రవారం దివంగత ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లీకి అంకితం చేసిన ‘మోరోపంత్ పింగ్లీ: ది ఆర్కిటెక్ట్ ఆఫ్ హిందూ రిసర్జన్స్’ పుస్తకావి ష్కరణకు మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మోరోపంత్ పింగ్లీ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు.
‘75 ఏళ్లు నిండిన తర్వాత మీకు శాలువాతో సత్కారం లభిస్తే దాని అర్థం మీరు ఇక ఆగిపోవాలి. పదవి నుంచి తప్పుకొని ఇతరులకు అవకాశమివ్వాలని పింగ్లే చెప్పేవారు’ అని మోహన్ భగవత్ పేర్కొన్నారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ క్రమంలో మోహన్ భగవత్ వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు బలమైన ఆయుధంగా మారింది.
ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించే రిటైర్మెంట్ వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 17న ప్రధాని మోదీకి 75 ఏళ్లు పూర్తి కానున్నాయి. దానికి ఆరు రోజుల ముందు అంటే సెప్టెంబర్ 11న మోహన్ భగవత్ కూడా 75 ఏళ్ల పూర్తి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ ప్రధాని ‘ఎక్స్’ వేదికగా మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘మోదీ విదేశీ పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చారో లేదో.. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. మోదీకి 75 ఏళ్లు నిండబోతున్నాయని గుర్తు చేశారు. దీనర్థం ఇక మోదీ తప్పుకోవాలనే కదా’ అని చురకలంటించారు. ఆ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌కు కూడా 75 ఏళ్లు నిండుతాయని మరో ట్వీట్ చేశారు. మరో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కూడా మోదీపై విమర్శలు చేశారు. ‘మీ ఇద్దరికి 75 ఏళ్లు నిండబోతున్నాయి. కాబట్టి మీరిద్దరూ బ్యాగ్ సర్దుకొని ఒకరినొకరు గైడ్ చేసుకోండి’ అని ట్వీట్ చేశారు.
మా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించింది: ఆర్‌ఎస్‌ఎస్
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఆర్‌ఎస్‌ఎస్ వివరణ ఇస్తూ మరో లేఖను విడుదల చేసింది. కేవలం దివంగత ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త మోరోపింత్ పింగ్లీ గతంలో చేసిన వ్యాఖ్యలనే ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ స్మరించుకున్నారని తెలిపింది. అంతేకాని ప్రధాని మోదీ సహా ఇతర నాయకులనుద్దేశించి పదవీ విరమణ గురించి మోహన్ భగవత్ ఎక్కడా ప్రస్తావించలేదని వెల్లడించింది. కేవలం తమ రాజకీయ ప్రయోజనం కోసమే కాంగ్రెస్ తమ వ్యాఖ్యలను వక్రీకరించిందని ఆర్‌ఎస్‌ఎన్ నొక్కిచెప్పింది.