calender_icon.png 5 October, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడుపాయల్లో కొట్టుకుపోయిన యువకులు

05-10-2025 12:13:21 AM

-కాపాడిన రెస్క్యూ టీమ్, పోలీసులు

-అమ్మవారి విగ్రహ నిమజ్జనానికి వచ్చిన హైదరాబాద్ కూకట్‌పల్లి వాసులు

-నీటి ప్రవాహాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ

పాపన్నపేట, అక్టోబర్ 4 (విజయక్రాం తి): రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన మెదక్ జిల్లా ఏడుపాయల్లో ఇద్దరు యువకు లు కొట్టుకుపోగా పోలీసులు వారిని కాపాడారు. వివరాలు..హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన 20 మంది యువకులు దుర్గమ్మ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు శనివారం ఏడుపాయలకు వచ్చారు. ఆలయం సమీపంలో ఉన్న చెక్ డ్యామ్ అవతలి వైపు విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. అనంతరం స్నానం చేసేందుకు వినయ్, సాయి అనే ఇద్దరు యువకులు నదిలోకి దిగారు.

ఈ క్రమంలో వినయ్ కాలు జారి నదిలో కొట్టుకుపోతుండగా గమనించిన సాయి అతన్ని కాపాడే క్రమంలో ముందుకు వెళ్లగా వారిద్దరు ప్రవాహంలో కొంత దూరం కొట్టుకు పోయి నది మధ్యలో ఉన్న చెట్లను పట్టుకొని ఆగారు. దీంతో తోటి స్నేహితులు, స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ క్యూఆర్టీ టీమ్,  పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

విషయం తెలుసుకున్న డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ జార్జి, అగ్నిమాపక కేంద్రం అధికారి వెంకటేష్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఫైర్, పోలీసు సిబ్బంది తాడు సాయంతో నదిలోకి దిగి ఇద్దరిని ఒడ్డు కు తీసుకువచ్చి సంబంధీకులకు అప్పగించారు. ఈ సందర్భంగా యువకుల ప్రాణాలు కాపాడిన అగ్నిమాపక, పోలీసు సిబ్బందిని తోటి స్నేహితులు, స్థానికులు అభినందించారు. కాగా  నీటి ప్రవాహాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. నిమజ్జనాల కోసం వచ్చే వారు నది ప్రవాహం వైపు వెళ్లొద్దని, పోలీసు అధికారుల సూచనలు పాటించాలన్నారు.