18-10-2025 12:00:00 AM
ఓటు అనే రెండు అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక అసెంబ్లీకి ఉప ఎన్నిక వచ్చింది. అలాగే పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో హైకోర్టు స్టే విధించడంతో అవి ఆగిపోయాయి. అయితే కొంత సమయం పట్టినా స్థానిక ఎన్నికలు తప్పక జరగాల్సిందే. ఈ నేపథ్యంలో యువత రాజకీయాల వైపు అడుగులు వేయాల్సిన అవసరముంది.
రాజకీయాల్లో మంచి చేయడం కోసం యువత పోటీ చేయాల్సిందే. రాజకీయాలకు ఎంట్రీగా భావించే వార్డు సభ్యుల నుంచి సర్పంచ్, ఉప సర్పంచ్ వరకు పోటీ పడాలి. గ్రామల్లో యువకులు డిగ్రీలు అర్హతగా పెట్టుకొని జ్ఞానవంతులుగా ఉన్నప్పటికీ మాకెందుకులే అన్న ధో రణి నేటి యువతలో ఎక్కువగా కనిపిస్తున్నది. నిధులు లేక గ్రామాలు అభివృద్ధిలో వెనుకడుగు వేయడాన్ని గమనిస్తున్న యువత అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించే తత్వాన్ని మాత్రం అలవరచుకోలేకపోతుంది.
రాజకీయాలు తెలియకా? డబ్బు లేకపోవడమా? తెలివి తేటలు లేకపోవడమా? ప్రజలను పాలించే సత్తా, దమ్ము లేకపోవడమా? అనేది యువత రాజకీయాల్లోకి రాకపోవడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లోగా యువత మేల్కొని సర్పంచ్‌లుగా పోటీ చేయాలి. ఆరోగ్యకర రాజకీయాలను, అభివృద్ధి రాజకీయాలను తీసుకురావాల్సిందే యువతే.
కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తున్నది. ఓటు హక్కును పొం దడం, వినియోగించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత. ఓటర్లు తమ ఓటు హక్కుతో నచ్చినవారికి అధికారం కట్టబెడతారు. మార్పు అనేది యువతరంతోనే సాధ్యం.
నరేందర్, వికారాబాద్