'భారత్ సమ్మిట్' దేశ వ్యతిరేకుల సమ్మేళనం
- సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ నిరసన
- చైతన్యపురి చౌరస్తాలో సీఎం దిష్టిబొమ్మ దహనం
ఎల్బీనగర్, నవంబర్ 14 : భారత్ సదస్సు నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నాయకులు(BJP leaders) ఆందోళనకు చేపట్టారు. బీజేపీ గడ్డిఅన్నారం డివిజన్ అధ్యక్షుడు దాసరి జయప్రకాష్(Dasari Jayaprakash) ఆధ్వర్యంలో శనివారం చైతన్యపురి చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జి సామ రంగారెడ్డి, గడ్డిఅన్నారం డివిజన్ మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత్ సదస్సు(Bharat Summit) పేరుతో దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే శక్తులకు వేదిక అన్నారు. 70 దేశాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులను ఆహ్వానించినట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి, వీసాల అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని విమర్శించడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. వీసాల మంజూరు, రద్దు ప్రక్రియలు కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా జరుగుతాయని పేర్కొన్నారు.
అంతర్జాతీయ సదస్సులు రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి కల్పనకు దోహదపడాలే తప్పా, రాజకీయ విమర్శలకు వేదికలుగా మారకూడదని హితవు పలికారు. కాగా, నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీధర్ రెడ్డి, కృష్ణం రాజు, మల్లేశ్, శ్రీనివాస్, మురళి, రాజేశ్వరి, బద్దం వివేకానంద రెడ్డి, కేశవ్, లోకేశ్, సందీప్, రూప్ లాల్, భీష్మా చారి, వివేక్ చారి, సతీశ్ చారి, దినేశ్, రత్నం, హరీశ్, వంశీ, రఘునందన్ జోషి, సిద్దు, బాబు చౌదరి తదితరులు పాల్గొన్నారు.