బాలల హక్కులను కాపాడాలి

14-11-2026 | 10:00pm

- అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి

- దిల్ సుఖ్ నగర్ లో చైల్డ్ హెల్ప్ డెస్క్ ప్రారంభం

ఎల్బీనగర్, నవంబర్ 14 : బాలల హక్కులను(Children's rights) కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి(Additional Collector Dr. Kiranmayi) అన్నారు. దిల్ సుఖ్ నగర్ బస్టాండ్(Dilsukhnagar Bus Stand) లో శనివారం రంగారెడ్డి జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చైల్డ్ హెల్ప్ డెస్క్(Child Help Desk) ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ.. బాలల హక్కుల పరిరక్షణ, భద్రత, సంరక్షణ, సంక్షేమం ప్రతి ఒక్కరి బాధ్యత పేర్కొన్నారు.

ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రాంతాల్లో తప్పిపోయిన పిల్లలు, ఆపదలో ఉన్న బాలలు, బాల కార్మికత్వానికి గురవుతున్న పిల్లలు, నిరాదరణకు గురైన బాలలను గుర్తించి తక్షణ సహాయం అందించడంలో చైల్డ్ హెల్ప్ డెస్కు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. బాలల రక్షణకు సంబంధించి అధికారులు, స్వచ్చంద సంస్థలు మరియు ప్రజలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం చిన్నారులతో ముచ్చటించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పిల్లలతో కలిసి కేక్ కట్ చేయించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల రక్షణ కోసం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను జిల్లా సంక్షేమశాఖ అధికారి శాంతిశ్రీ వివరించారు.  బాలలపై వేధింపులు, దోపిడీ, నిర్లక్ష్యం లేదా హక్కుల ఉల్లంఘన జరిగినా వెంటనే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ ద్వారా అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) చైర్మన్ డాక్టర్ కాట నరేందర్ రెడ్డి,  దిల్ సుఖ్ నగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ పవన్ కుమార్, సీడీపీవోలు రేణుక, జ్యోత్స్న, జువెనైల్ జస్టిస్ బోర్డు సోషల్ వర్కర్ వాసు, బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ రోజా, జిల్లా బాలల సంరక్షణ అధికారి ప్రవీణ్ కుమార్, చైల్డ్ హెల్ప్ లైన్ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు