బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
- మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్
గజ్వేల్: బాలల హక్కుల పరిరక్షణ(Child Rights Protection) ప్రతి ఒక్కరి బాధ్యతని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్(Former Market Committee Chairman Madasu Srinivas) అన్నారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా అహ్మదీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ బ్యాగారి ప్రభాకర్ ఆధ్వర్యంలో బాలస్నేహపూర్వక గ్రామపంచాయతీ ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి చిన్నారులే రేపటి దేశ భవిష్యత్తు అని పేర్కొన్నారు. ప్రతి బాలుడికి నాణ్యమైన విద్య, వైద్యం, పౌష్టికాహారం, రక్షణ కల్పించాలన్నారు.
బాల్యవివాహాలు, బాలలపై వేధింపులు, వివక్షను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పేదరికంతో ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదని, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలపై పెట్టే ఖర్చు దేశ భవిష్యత్తుపై పెట్టే పెట్టుబడి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సుగుణాకర్, పంచాయతీ కార్యదర్శి కుమారస్వామి, నాయకులు రమేష్ గౌడ్, అహ్మద్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.