24 గంటల స్ట్రోక్ కమాండ్ సెంటర్
అపోలో ఆస్పత్రిలో ప్రారంభం
హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అపోలో హాస్పిటల్(Apollo Hospital)లో 24 గంటల స్ట్రోక్ కమాండ్ సెంటర్(Stroke Command Center)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్టులు డాక్టర్ జి. రంజిత్, డాక్టర్ వేముల శ్రీకాంత్ మాట్లాడుతూ.. ముఖం వాలిపోవడం, చేతులు, కాళ్లు బలహీనపడటం, మాట తడబడటం, చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి చేరుకోవాలని సూచించారు.
స్ట్రోక్ చికిత్సలో ప్రతి నిమిషం కీలకమని, ఆలస్యం జరిగితే మెదడుకు శాశ్వత నష్టం కలిగే ప్రమాదం ఉందన్నారు. అపోలో హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హర్కరన్ మాట్లాడుతూ.. ఈ కమాండ్ సెంటర్ ద్వారా సమీప ఆసుపత్రులు, వైద్య నిపుణులు, అంబులెన్స్ సేవలను సమన్వయం చేసి వేగంగా చికిత్స అందిస్తామని తెలిపారు. దీనివల్ల అర్హులైన బాధితులకు థ్రాంబోలైసిస్ చికిత్సను సత్వరమే అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.