విద్యాశాఖ వైఫల్యాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం

16-11-2026 | 05:58pm

ఇల్లెందు, నవంబర్ 16 (విజయక్రాంతి): విద్యాశాఖ అధికారుల(Education officials) తీరును నిరసిస్తూ ఈ నెల 18న ఇల్లందు మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల బంద్‌కు పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. మర్రిగూడెం పాఠశాల ఉపాధ్యాయుడు రమేష్‌పై విధించిన సస్పెన్షన్‌ను వారం రోజులకే ఎత్తివేయడంపై, మరో ఉపాధ్యాయుడు వెంకట్రాములుపై ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయడంపై విద్యార్థి సంఘాల నాయకులు జె. గణేష్, గంగాధర గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోమవారం ప్రజాపంథా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రమేష్ పాఠశాలకు గైర్హాజరై జీతభత్యాలు పొందినట్లు ఐదుగురు ఎంఈఓలతో విచారణ జరిపించి నవంబర్ 5న సస్పెండ్ చేసిన అధికారులు, వారం రోజుల్లోనే తిరిగి పోస్టింగ్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మరో ఉపాధ్యాయుడు వెంకట్రాములుపై విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నప్పటికీ సమగ్ర చర్యలు తీసుకోవడం లేదన్నారు. అధికారులపై ముడుపుల ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొంటూ, ఈ వ్యవహారాలపై పారదర్శక విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. బంద్‌కు ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పీడీఎస్‌యూ నాయకులు ఆయుష్, శ్రావణి, హేమచంద్ర, రోహిత్, నాగచైతన్య, లక్ష్మీనరసింహ, అస్లాం, విష్ణు, కార్తీక్, జస్వంత్, గౌతమ్, నాగేంద్రబాబు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు