పాత పెన్షన్ కోసం ఉద్యోగుల సమరశంఖం
- నవంబర్ 17 సామూహిక సెలవు
- జిల్లా వ్యాప్తంగా వినతి పత్రాలు
ములుగు, నవంబర్ 16 (విజయక్రాంతి): పాత పెన్షన్ విధానాన్ని(Old Pension System) యధావిధిగా అమలు చేయాలని జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు అధికారులకు సామూహిక సెలవుకు మంగళవారం వినతి పత్రాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కోసం నవంబర్ 17న తలపెట్టిన సామూహిక సెలవు కార్యక్రమానికి అనుమతి కోరుతూ మంగళవారం ములుగు జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే ని సంఘం జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.
సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు నేడు సామూహిక సెలవు పాటిస్తున్నారని, ఇందుకు జిల్లా యంత్రాంగం సహకరించి అనుమతించాలని కలెక్టర్ ని ఈ సందర్భంగా వారు కోరారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల భవిష్యత్తు భద్రత కోసం చేపట్టిన ఈ సమరశంఖంలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాల సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నవంబర్ 17న స్వచ్ఛందంగా సామూహిక సెలవు పెట్టి తమ నిరసనను, ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎస్ ఉద్యోగుల సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు అన్నవరం రవికాంత్, రాష్ట్ర కార్యదర్శి గుల్లగట్టు సంజీవ, మహిళ అధ్యక్షురాలు వంగాల వనజ, కొట్టె శకుంతల, శైలజ, బి.మమత తదితరులు పాల్గొన్నారు...