కార్తీక కోటి సోమవారం.. వాడపల్లి ఆలయాలకు పోటెత్తిన భక్తులు
దామరచర్ల నవంబర్ 16: దామరచర్ల మండలం(Damercherla Mandal)లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వాడపల్లి భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన కార్తీక కోటి సోమవారం సందర్భంగా వాడపల్లి ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక ప్రారంభం కావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శివనామస్మరణతో ఆలయాలు మారుమోగగా, భక్తుల సందడి నెలకొంది.
కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు కృష్ణా, మూసీ నదుల పవిత్ర సంగమ ప్రాంతానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం నదీ తీరంలో, ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపాల వెలుగులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని తలపించాయి.
పుణ్యస్నానాల అనంతరం భక్తులు వాడపల్లిలోని శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి ఆలయంతో పాటు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయంలో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, నరసింహస్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు కుటుంబ సమేతంగా స్వామివార్లను దర్శించుకున్నారు. కార్తీక మాసంలో ఉపవాసాలు, దీపారాధనలు, నదీ స్నానాలు, శివారాధనకు విశేష ప్రాధాన్యత ఉండటంతో ఈ పవిత్ర సోమవారం వాడపల్లికి భక్తుల తాకిడి మరింత పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయాల పరిసరాలు సందడిగా మారాయి.