తాగునీటి ట్యాంకు పాఠశాల పరిసరాలు పరిశుభ్రం చేయించిన సర్పంచ్
*విద్యార్థుల సమస్యలపై స్పందించిన సర్పంచ్ ఆదిలక్ష్మి
ములకలపల్లి, నవంబర్ 16 (విజయకాంతి): ములకలపల్లి మండలంలోని మూకమామిడి పంచాయతీలో బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో సోమవారం బాలసభ నిర్వహించడం జరిగింది. ఈ బాలసభలో పాఠశాలకు సంబంధించిన సమస్యలను విద్యార్థులు నేరుగా సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లడంతో విద్యార్థులు చెప్పిన సమస్యలపై సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి(Sarpanch Adhilakshmi) స్పందించి ఎంపీపీఎస్ మూకమామిడి పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పాఠశాల ఆవరణలో ఉన్న మునగ చెట్టుకు పురుగులు పడి, పాఠశాలకు వచ్చే విద్యార్థులపై పడుతున్నాయని విద్యార్థులు చెప్పిన సమస్యను తెలుసుకుని వెంటనే పంచాయతీ సిబ్బందితో చెట్ల కొమ్మలను తొలగించడం జరిగింది. అంతేకాకుండా పాఠశాల ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి,పాఠశాల ఆవరణను పూర్తిగా శుభ్రం చేయించారు. విద్యార్థులు తాగే మంచినీటి ట్యాంకులను శుభ్రపరిచి, పరిశుభ్రమైన నీరు అందించేలా చర్యలు తీసుకున్నారు. పాఠశాలలో పలు సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించడం జరిగింది.
అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం నాణ్యత, పరిశుభ్రత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను సర్పంచ్ వెంటనే పరిష్కరించడం పట్ల గ్రామస్తులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి మాట్లాడుతూ బాలసభ అంటే కేవలం మాటలు చెప్పడం కాదు పిల్లల సమస్యలను విని పరిష్కరించడమే నిజమైన బాలసభ అని బాలసభలో పిల్లలు ధైర్యంగా తమ సమస్యలను చెప్పారు. అదే నాకు చాలా సంతోషం అని అన్నారు.
పిల్లలు చెప్పిన వెంటనే నేను స్కూలుకు వచ్చి చూశాను.మునగ చెట్టు మీద ఉన్న పురుగులు పిల్లల మీద పడుతుంటే ఎలా చదువుకుంటారు? అందుకే వెంటనే కొమ్మలు తొలగించాం.పిల్లలకు శుభ్రమైన తాగునీరు,మంచి భోజనం అందించడం మన బాధ్యత.పిల్లలకు ఏ సమస్య వచ్చినా నాకు నేరుగా చెప్పండి అని అన్నారు.మీ సమస్యలను పరిష్కరించడానికి నేను ఎప్పుడూ ముందుంటాను అని,పిల్లలు బాగా చదువుకోవాలి,ఆరోగ్యంగా ఉండాలి.మన పాఠశాలను మన గ్రామంలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతాం అని అన్నారు. పిల్లలు చెప్పిన సమస్యలను వెంటనే పరిష్కరించిన సర్పంచ్ కు ఉపాధ్యాయులు,విద్యార్థులు,తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ దోమల అరుణ్ కుమార్,ఉపాధ్యాయులు బి శ్రీను పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.