అన్నదాతలకు చట్టాలపై అవగాహన అవసరం
జిల్లా న్యాయ సేవాధికారా సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్
ములకలపల్లి,(విజయక్రాంతి): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) ఆధ్వర్యంలో గురువారం ముల్కలపల్లి మండలంలోని రైతు వేదికలో న్యాయ అవగాహన కార్యక్రమం(Legal Awareness Program) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, (సీనియర్ సివిల్ జడ్జి) ఎం. రాజేందర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ... విత్తన చట్టం (Seeds Act) ప్రకారం నాణ్యమైన విత్తనాల ఎంపిక, నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తత, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు రసీదులు భద్రపరచుకోవడం, పంట నష్టాలు లేదా నాణ్యతలేని విత్తనాల వల్ల నష్టం కలిగినప్పుడు చట్టపరంగా పరిహారం పొందే మార్గాలను వివరించారు.
రైతులు(Farmers) తమ సమస్యల పరిష్కారానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సలహాలు, సహాయం పొందవచ్చని తెలిపారు. అనంతరం బాల్య వివాహాల నిరోధక చట్టంపై మాట్లాడుతూ... బాల్య వివాహాలు బాలల భవిష్యత్తును దెబ్బతీస్తాయని, బాల్య వివాహాల వల్ల ముఖ్యంగా బాలికల విద్య, ఆరోగ్యం, భద్రతపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. 18 సంవత్సరాలు నిండని బాలికలకు, 21 సంవత్సరాలు నిండని బాలురకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలను ప్రోత్సహించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
అలాగే, పోక్సో చట్టం (POCSO Act)ను వివరిస్తూ,పిల్లలపై జరిగే లైంగిక వేధింపులు,దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ చట్టం రూపొందించబడిందని తెలిపారు. పిల్లల భద్రత పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు,గ్రామ పెద్దలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పిల్లలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, అగ్రికల్చర్ ఆఫీసర్ అరుణ్ బాబు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ సూరిబాబు, రాహుల్ గాంధీ, సుజాత, సీడీపీవో లలిత,ఎన్జీవో జ్యోతి, మౌనిక, ముల్కలపల్లి సర్పంచ్ చంద్రలేఖ, మాధారం సర్పంచ్ సుజాత, వీకే రామావరం సర్పంచ్ ఊకే ఆదిలక్ష్మి, పారాలీగల్ వాలంటీర్లు వీరభద్రం, భిక్షమయ్య, జానకిరాం, రైతులు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.