భూ సర్వేతో వివాదాలకు పరిష్కారం

19-11-2026 | 08:04pm

కలెక్టర్ కుమార్ దీపక్

భీమిని / కన్నెపల్లి, (విజయక్రాంతి) :  సమగ్ర భూ సర్వే (Comprehensive Land Survey) ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు, రైతుల భూములకు ఖచ్చితమైన హద్దులు గుర్తించి భవిష్యత్తులో ఎలాంటి భూ సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన రికార్డులు రూపొందించడం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) అన్నారు.

సమగ్ర భూ సర్వే అవగాహన సదస్సులలో భాగంగా గురువారం మంచిర్యాల జిల్లా భీమిని మండలం రాజారాం గ్రామంలో నిర్వహించిన సదస్సుకు బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, తహసీల్దార్‌ బికర్ణదాస్, కన్నెపల్లి మండలం నాగపల్లి గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు సబ్ కలెక్టర్, తహసీల్దార్ రామచందర్‌ లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూముల కొలతలలో వ్యత్యాసాలు, సర్వే నంబర్లలో గందరగోళం, భూముల హద్దుల విషయంలో రైతుల మధ్య తలెత్తుతున్న వివాదాలు, ఒకరి భూమిలోకి మరొకరు ఆక్రమణలు జరగడం వంటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూ సర్వే చేపట్టిందన్నారు.

సర్వే ప్రక్రియలో భాగంగా రైతులకు జెండాలను అందజేయడం జరుగుతుందని, సంబంధిత భూముల సర్వే తేదీకి రెండు రోజుల ముందుగానే రైతులు తమ భూముల 4 వైపులా జెండాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో భూములను కొలతలు వేసి, ఖచ్చితమైన హద్దులు గుర్తించి డిజిటల్ మ్యాపులను రూపొందిస్తారని తెలిపారు.

భూములకు సంబంధించిన కో-ఆర్డినేట్స్ ఆధారంగా భవిష్యత్తులో ఎప్పుడైనా భూముల హద్దులను గుర్తించే అవకాశం ఉంటుందని, తద్వారా భూ ఆక్రమణలు, హద్దుల వివాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. ప్రతి సర్వే నంబర్‌కు సంబంధించిన భూమి విస్తీర్ణం, అందులో ఉన్న పట్టాదారులు, వారి భూముల వివరాలను అనుసంధానం చేసి సమగ్ర మ్యాపులను రూపొందించడం జరుగుతుందని తెలిపారు.

భవిష్యత్తులో భూముల కొనుగోలు, అమ్మకాలు, వారసత్వ బదిలీలు జరిగినప్పుడు మ్యాపులలో సంబంధిత మార్పులు నమోదవుతాయని, తద్వారా భూ రికార్డులలో పారదర్శకత పెరుగుతుందని వివరించారు. సర్వేలో భాగంగా ప్రభుత్వ భూములు, పట్టా భూములు, లావుని పట్టా భూములకు సంబంధించి వాస్తవ విస్తీర్ణాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

లావుని పట్టా భూములకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల వాస్తవ స్థితిని పరిశీలించి, నిబంధనల ప్రకారం రికార్డులలో మార్పులు చేయడం జరుగుతుందని తెలిపారు. పట్టా భూములలో కొంతమందికి రికార్డుల ప్రకారం ఉన్న విస్తీర్ణం కంటే ఎక్కువ, మరికొంత మందికి తక్కువ భూమి ఉన్నట్లు గుర్తించిన సందర్భాలలో సంబంధిత రైతులకు వివరాలతో కూడిన జాబితా అందజేస్తామని తెలిపారు.

రైతులు పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పిస్తామని, అంగీకారం కుదరని పక్షంలో నిబంధనల ప్రకారం వాస్తవ పరిస్థితుల దృష్ట్యా పట్టా హక్కులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుటుంబ సభ్యుల మధ్య వారసత్వ వివాదాలు, సంతకాల సమస్యలు వంటి సివిల్ వివాదాలు సంబంధిత న్యాయస్థానాల పరిధిలో పరిష్కరించుకోవలసి ఉంటుందని తెలిపారు. 

జిల్లాలోని 12 గ్రామాలలో భూ సర్వే ప్రక్రియ పూర్తయిందని, దాదాపు 90 నుంచి 95 శాతం వరకు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణం ఉన్న గ్రామంలో సర్వే ప్రక్రియను 15 రోజులలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని, సర్వే పూర్తయిన అనంతరం గ్రామంలో రైతుల సమక్షంలో భూముల విస్తీర్ణం వివరాలను వెల్లడించి,

వారి సంతకాలు తీసుకోవడంతో పాటు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేసేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. రైతులందరూ సమగ్ర భూ సర్వే ప్రాముఖ్యతను గుర్తించి, తమ భూములకు సంబంధించిన హద్దులను సక్రమంగా గుర్తించేందుకు అధికారులకు సహకరించాలని, తద్వారా ప్రతి ఒక్కరికీ న్యాయబద్ధంగా భూ హక్కులు కల్పించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

భీమిని మండలం రాజారాం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, విద్యా బోధన, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలని, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా పర్యవేక్షించాలని, వారి అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.

మరిన్ని వార్తలు