నామినేటెడ్ తో నష్టాలు
సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి
రైతులు ఎన్నుకునే వాడే నాయకుడు కావాలి
రైతుల అభ్యర్థన
హైకోర్టు తీర్పుతో రైతుల్లో ఆనందం
తాడ్వాయి,(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్ పద్ధతిలో పదవులు ఎంపిక చేస్తుందడంతో నష్టాలు, ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పలువురు వాపోతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(Cooperative Societies) అంటేనే రైతులకు చేదోడు వాదోడుగా ఉండే సామూహిక స్నేహ సంఘం. ఈ సంఘంలో రైతులు ఎన్నుకునే వాడే నాయకుడు కావాలి. అలాంటి నాయకుడే రైతుల సమస్యలు పరిష్కరించడానికి అన్ని విధాలుగా కృషి చేస్తాడు.
కానీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా నామినేటెడ్ పద్ధతిలో సహకార సంఘాలకు చైర్మన్ పదవులు, డైరెక్టర్ పదవులు ఎంపిక చేస్తుందడంతో సంఘాలకు, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పలువురు రైతులు విమర్శిస్తున్నారు.ఈ విధానంలో ఎంపిక చేయడం సరైన పద్ధతి కాదని రైతులు(Farmers) వాపోతున్నారు. ఇటీవల కామారెడ్డి జిల్లాలో సహకార సంఘాలకు ప్రభుత్వం నామినేటెడ్ పద్దతిలో చైర్మన్, డైరెక్టర్లను ఎంపిక చేసి నియామకాలు చేపట్టింది. అందులో కొందరు అసలు రైతుల కష్టాలు తెలిసిన వారు లేకపోవడంతో తీవ్ర విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
సహకార సంఘానికి చైర్మన్ పదవి లో కొనసాగాలంటే సదరు వ్యక్తి రైతు అయి ఉండి వ్యవసాయంలో అనుభవం కలిగి ఉండాలి. కానీ అందుకు విభేధించి నియామకాలు చేపట్టడంతో రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇటీవల తాడ్వాయి, దేమికలాన్, లింగంపేట్ తదితర సింగిల్ విండోలకు పదవులు భర్తీ చేశారు. చైర్మన్ పదవి భాధ్యతలు నిర్వహించడానికి రైతుల సమస్యలు తెలిసి సమర్థుడై ఉండాలని,కానీ కొన్ని సింగిల్ విండో లలో అసలు రైతే కాకుండా సమస్యలు తెలియని వ్యక్తులను సైతం చైర్మన్, డైరెక్టర్ పదవులకు ఎంపిక చేస్తున్నారని దీంతో ఇబ్బందులు ఎదురావుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి రైతులే ఓట్లు వేసి చైర్మన్, డైరెక్టర్లను ఎన్నుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు. సదరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చురుకైన వ్యక్తిని చైర్మన్ గా రైతులు ఎన్నుకునే అవకాశం ఉంటుంది. రైతుల కోసం పనిచేసే వ్యక్తినే చైర్మన్ గా ఎన్నుకుంటారు. తమకు అనుకూలమైన వ్యక్తులనే డైరెక్టర్లుగా ఎన్నుకుంటారు.
ఈ విధానంలో పార్టీలకు అతీతంగా రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.కానీ అందుకు విరుద్ధంగా ప్రభుత్వం నామినేటెడ్ పద్ధతిలో పదవులను భర్తీ చేయడం ఏమిటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి పదవులను భర్తీ చేయాలని రైతులు కోరుతున్నారు.
ఒక పార్టీకి చెందిన వారికే పదవులు
ప్రభుత్వం నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్,డైరెక్టర్లను నియమించడంతో రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ పదవులు అధికార పార్టీకి చెందిన వారినే వరించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగతా పార్టీలకు చెందిన రైతులు మేము రైతులము కామా మాకు అర్హతలు లేవా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నామినేటెడ్ పద్ధతిలో తమకు ఇష్టమైన అనుకూలమైన వారిని ఎంపిక చేయడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పలువురు వాపోతున్నారు. ఇటీవల జిల్లాలో సింగిల్ విండో లకు ఇదే పద్ధతిలో చైర్మన్, డైరెక్టర్ పదవులను భర్తీ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై సమగ్రంగా పరిశీలించి గతంలో మాదిరిగా ఎన్నికలు నిర్వహించి పదవులు భర్తీ చేయాలని రైతులు కోరుతున్నారు.
హైకోర్టు తీర్పుతో రైతుల్లో ఆనందం
రాష్ట్ర హైకోర్టు బుధవారం వెల్లడించిన తీర్పుతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ప్రభుత్వం ఇటీవల నామినేటెడ్ పద్ధతిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు చేపట్టిన నియామకాలు చెల్లవు అని బుధవారం తీర్పు వెలువరించడంతో రైతులు సంబరపడిపోతున్నారు. వెంటనే రెండు వారాల్లోగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పును వెల్లడించింది.
నామినేటెడ్ పద్ధతిలో నియమకాలు చేపట్టడంతో ఇబ్బందులు తలెత్తుతాయని కోర్టు స్పష్టం చేసింది.కొందరు ప్రభుత్వ నియామకాలను తప్పుపడుతూ హైకోర్టు ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించి రైతులే చైర్మన్, డైరెక్టర్లను ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.