గ్రామ స్వరాజ్యమే ప్రభుత్వ లక్ష్యం

19-11-2026 | 07:54pm

ఐదు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే

ఇల్లెందు, (విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధి(Development of Villages), ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. గురువారం ఇల్లందు మండలంలోని రాఘబోయినగూడెం, సుభాష్‌నగర్, మొండితోగు, మసివాగు, ముత్తారపుకట్ట గ్రామాల్లో ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

రాఘబోయినగూడెం పంచాయతీ పరిధిలోని నారాయణపురంలో నూతన ఎంపీపీఎస్ పాఠశాల భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. మొండితోగు పంచాయతీ పరిధిలోని ధర్మాపురంలో మహిళా సంఘాల భవనాలను, సుభాష్‌నగర్, మసివాగు, ముత్తారపుకట్ట గ్రామాల్లో నూతన గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్వరాజ్య సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రతి కుటుంబానికి భరోసా కల్పించేందుకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మహిళల పేరుతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

గ్రామాల అభివృద్ధిలో స్థానిక పాలకవర్గాలు భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మండల రాంమహేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ పెండేల రాజు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బోళ్ల సూర్యం, ఎట్టి హరికృష్ణ, బానోత్ శారద, కునుసోత్ రాము, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు