తెలంగాణ తిరుపతిని సందర్శించిన జిల్లా కలెక్టర్

19-11-2026 | 07:53pm

స్వామివారికి ప్రత్యేక పూజలు... ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై ఆరా

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తెలంగాణ తిరుపతి దేవస్థానాన్ని గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan) సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్‌కు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, ఆలయ నిర్వహణ, వివిధ సేవా కార్యక్రమాలపై ఆలయ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రతిరోజూ స్వామివారి దర్శనానికి తరలివచ్చే భక్తుల సంఖ్య, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ, ప్రత్యేక పర్వదినాల్లో భక్తుల రద్దీ తదితర అంశాలపై వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులతో చర్చించారు. అదేవిధంగా స్వామివారి లడ్డూ ప్రసాదాల తయారీ, పంపిణీ విధానం, భక్తులకు కల్పిస్తున్న వసతి సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఆలయ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

ప్రత్యేక పూజలు, పండుగలు, ఇతర ముఖ్యమైన సందర్భాల్లో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా వేద పండితులు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి వేద ఆశీర్వచనాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, ఆర్డీవో రవీందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు