డిజిటల్ ప్రపంచంలో అప్రమత్తతే రక్షణ

19-11-2026 | 07:48pm

మహబూబాబాద్ టౌన్, నవంబర్ 19 (విజయక్రాంతి): సోషల్ మీడియా(Social Media), ఆన్‌లైన్ పరిచయాల(Online contacts) విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని షీ టీం ఎస్‌ఐ సునంద సూచించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు బుధవారం మహబూబాబాద్ పట్టణంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో షీ టీం, భరోసా, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించాయి.

ఈ సందర్భంగా ఎస్‌ఐ సునంద మాట్లాడుతూ అపరిచితులతో ఆన్‌లైన్ స్నేహాలు చేయవద్దని, వ్యక్తిగత వివరాలు, ఫొటోలు పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసాలు, ఆన్‌లైన్ వేధింపుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సమస్యలు ఎదురైతే భయపడకుండా పోలీసులను సంప్రదించాలని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. విద్యార్థులకు గుడ్ టచ్,బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, మహిళలు, బాలల రక్షణ, మానవ అక్రమ రవాణా నివారణ, సైబర్ నేరాలు, వ్యక్తిగత భద్రత, టీ-సేఫ్ యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు.

అత్యవసర సహాయం కోసం 112, సైబర్ క్రైమ్ ఫిర్యాదులకు 1930, షీ టీం వాట్సాప్ నంబర్ 8712656935ను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ ప్రమోద్ రెడ్డి, ప్రిన్సిపాల్ సుధీర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, షీ టీం సిబ్బంది రమేష్, సుధారాణి, ప్రియాంక, భరోసా సిబ్బంది మౌనిక, ఏ హెచ్ టీ యూ సిబ్బంది ఏఎస్ఐ రాజు, సుప్రజ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు