ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం!

16-11-2026 | 05:58pm

రైతులను నట్టేట ముంచుతున్న ప్రభుత్వం.. మిల్లర్లు, అధికారుల కుమ్మక్కుతో అన్నదాతలకు అన్యాయం

యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలి: ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల బిక్షపతి..

ఆలేరు, నవంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల బిక్షపతి(AIKMS President Mamidala Bikshapathi) తీవ్రస్థాయిలో విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో వ్యవసాయ మార్కెట్లు, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సోమవారం ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మామిడాల బిక్షపతి మాట్లాడుతూ.. ఒకవైపు ఎల్‌నినో ప్రభావం ప్రజలను, రైతులను, వ్యవసాయ కూలీలను ఆందోళనకు గురిచేస్తుంటే, మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆదుకునేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.

మిల్లర్లు, అధికారుల కుమ్మక్కుతో రైతులకు నష్టం: ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు కల్లెపు అడివయ్య, ప్రధాన కార్యదర్శి బేజాడి కుమార్ మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరకముందే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల్సి ఉందన్నారు. మధ్య దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ధాన్యాన్ని కొనుగోలు చేసి ఉంటే రైతులు మోసాలకు, ఆర్థిక నష్టాలకు గురయ్యేవారు కాదని పేర్కొన్నారు. కానీ కొంతమంది అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని ఆరోపించారు. వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా గౌరవాధ్యక్షుడు మామిడాల సోమయ్య, ఇక్కిరి సహదేవ్, మామిడాల బాల మల్లేష్, ఆర్. సీత, మందనపల్లి ఉపసర్పంచ్ పద్మ శశిరేఖ, చిరబోయిన కొమురయ్య, తమ్మడి అంజయ్య, పిన్నపురెడ్డి రాఘవరెడ్డి, కడకంచి బీరయ్య, చిరబోయిన బాలయ్య, వంగాల మధుసూదన్ రెడ్డి, పద్మ సుదర్శన్, మారుజోడు సిద్ధేశ్వర్, కల్లెపు చంద్రయ్య, మేకల వెంకటేష్, కడకంచి సత్యనారాయణ, కుర్రి సత్యనారాయణ, కుర్రి మార్కండేయ, దార యాదగిరి, రామచంద్రు, కే. సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు