సింగరేణిలో అప్రెంటిస్‌లతో వెట్టి చాకిరీ!
- ట్రేడ్ టెక్నీషియన్స్ లతో కూలి పనులు
- సాంకేతిక నైపుణ్యాలు గాలికి వదిలేసిన వైనం
- జీఎం రామ్మోహన్‌రావు వ్యవహారశైలిపై విమర్శలు
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 19 ( విజయ క్రాంతి): సాంకేతిక విద్యను(technical education) అభ్యసించి పరిశ్రమల్లో వృత్తిపరమైన నైపుణ్యాలు సంపాదించాలనే లక్ష్యంతో సింగరేణి సంస్థలో(Singareni Company) అప్రెంటిస్‌షిప్‌కు చేరిన ఐటీఐ అభ్యర్థులకు నిరాశే ఎదురవుతోందా..? శిక్షణ పేరుతో వారికి సాంకేతిక పనులు నేర్పించాల్సిన బాధ్యతను విస్మరించి, కూలి పనులకు పరిమితం చేస్తున్నారా..?
అన్న ప్రశ్నలు తాజాగా తెరపైకి వస్తున్నాయి. కొత్తగూడెంలోని సింగరేణి సెంట్రల్ వర్క్‌షాప్‌లో ఎలక్ట్రిషియన్ విభాగానికి చెందిన అప్రెంటిస్‌షిప్ అభ్యర్థులతో మట్టి పనులు, పైపులు తొలగించడం, ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం,ఇతర శారీరక శ్రమతో కూడిన పనులు చేయిస్తున్న అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అప్రెంటిస్‌లతో కూలి పనులా?
ఐటీఐలో ఎలక్ట్రిషియన్ కోర్సు పూర్తి చేసి అప్రెంటిస్‌షిప్‌లో చేరిన అభ్యర్థులకు విద్యుత్ పరికరాలు, వైరింగ్, మోటార్లు, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ వంటి సాంకేతిక అంశాల్లో శిక్షణ అందించాల్సి ఉంటుంది. అయితే అందుకు భిన్నంగా వారితో మట్టి పనులు, పైపుల తొలగింపు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం గడ్డి తొలగించడం,
ఇతర కూలి పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాల్సిన అభ్యర్థులు రోజువారీ కూలీల మాదిరిగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీఎం వ్యవహారశైలిపై అసంతృప్తి
సెంట్రల్ వర్క్‌షాప్‌లో జీఎం రామ్మోహన్‌రావు వ్యవహారశైలి, అప్రెంటిస్‌ల పట్ల అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఏ పని చెప్తే అది చేయాలి లేదంటే మిమ్మల్ని వెనక్కి పంపించేస్తా అని అప్రెంటిస్ లకు, హుకుం జారీ చేయడం ఇతని నియంతృత్వ ధోరణికి అద్దం పడుతుంది.
ఎలక్ట్రికల్ అభ్యర్థుల తోటి ఫెన్సింగ్, గుంతల తొవ్వించి పోల్స్ పాతించడం ఇందుకు నిదర్శనం.అప్రెంటిస్‌షిప్ అనేది అభ్యర్థులకు వృత్తిపరమైన శిక్షణ, నైపుణ్యాలు అందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమమని, వారిని సాంకేతిక పనులకు దూరంగా ఉంచి కూలి పనులు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
సింగరేణి ఉన్నతాధికారులు స్పందించరా?
సింగరేణి సంస్థలో అప్రెంటిస్‌షిప్ పేరుతో అభ్యర్థుల శ్రమను ఏ విధంగా వినియోగిస్తున్నారు? ఎలక్ట్రిషియన్ అభ్యర్థులకు వారి ట్రేడ్‌కు సంబంధించిన శిక్షణ ఎందుకు అందించడం లేదు? ఈ వ్యవహారంపై సంబంధిత ఉన్నతాధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? లేక అప్రెంటిస్‌ల ఆవేదనను పట్టించుకోకుండా వదిలేస్తారా?
అన్నది వేచి చూడాల్సి ఉంది.అప్రెంటిస్‌షిప్ అంటే నైపుణ్యాల అభివృద్ధి కోసం కానీ, కూలి పనులు చేయించుకోవడానికి కాదని అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు.సింగరేణి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అప్రెంటిస్‌లకు వారి ట్రేడ్‌కు అనుగుణంగా శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.