ప్రాణం ఉన్నంత వరకు పాలమూరు ప్రాజెక్టు కోసం పోరాడతా.!
మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని(Palamuru-Ranga Reddy Lift Irrigation Scheme) పూర్తి చేసేలా తన ప్రాణం ఉన్నంతవరకు పోరాడతానని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి(Nagam Janardhan Reddy) స్పష్టం చేశారు. పాలమూరు ప్రాంతాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కల్వకుర్తి ప్రాజెక్టు మోటార్ల మరమ్మత్తు పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా పట్టించుకోవడం లేదన్నారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, పిల్ల కాలువల పనులు, కాలువల వెడల్పు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. భూసేకరణ చేపట్టకుండా, పరిహారం చెల్లించకుండా ప్రాజెక్టు పనులు ఎలా పూర్తి చేస్తారని నిలదీశారు. ప్రజలు ఐదేళ్ల పాటు అధికారమిస్తే ప్రజా సమస్యలను పట్టించుకునే తీరిక లేదా అని ప్రశ్నించారు.
ఉమ్మడి పాలమూరు ప్రాంత ప్రజా ప్రతినిధులకు రైతుల సమస్యలు ప్రాజెక్టుల సమస్యలపై సోయి లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయడానికి నిర్దిష్ట కాలపరిమితి ప్రకటించాలని, లేకుంటే మరెప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యే పరిస్థితి లేదని ఈ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. తనను ఆదరించిన ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
మంత్రి జూపల్లి తీరుపైనా విమర్శలు చేశారు. నల్గొండ ప్రాంతానికి ఎస్ఎల్బీసీ ఒక్కటే సరిపోవచ్చని, పాలమూరు ప్రాంతానికి సాగునీరు అందించేందుకు పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన అవసరం ఉందని నాగం జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. వారి వెంట బిఆర్ఎస్ నాయకులు బాలగౌడ్, లక్ష్మయ్య, అర్జున్, శేఖర్, సత్యం, భీముడు తదితరులు ఉన్నారు.