టీఎస్ యుటిఎఫ్ కుటుంబ సంక్షేమ పథక చెక్కు పంపిణీ
ములకలపల్లి, నవంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(Telangana State United Teachers Federation) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కుటుంబ సంక్షేమ పథకంలో సభ్యులుగా ఉండి మంగపేట జిపిఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు ఎం. కోటమ్మ ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతిచెందారు. వీరు కుటుంబ సంక్షేమ నిధి పథకంలో సభ్యులుగా ఉండి మృతి చెందారు.
అందుకుగాను వారి కుటుంబానికి టీఎస్ యుటిఎఫ్ కుటుంబ సంక్షేమ నిధి నుండి 6 లక్షల రూపాయల చెక్కును సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఆమె భర్త రామభద్రయ్యకు వారి స్వగృహంలో అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి పథకం కుటుంబ సంక్షేమ పథకం అని, ఈ పథకంలో చేరి వివిధ కారణాల చేత మరణించిన 70 మంది ఉపాధ్యాయులకు ఇప్పటివరకు నాలుగు కోట్ల 20 లక్షల రూపాయలు అందజేయడం జరిగిందని, ఇది కేవలం ఉపాధ్యాయుల సంక్షేమ నిమిత్తం ఉపాధ్యాయ సంఘంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని తెలిపారు.
అందరి కోసం ఒక్కరు, ఒక్కరి కోసం అందరూ అనే నినాదంతో ఈ పథకం ప్రారంభమైందని ఇది కేవలం టీఎస్ యుటిఎఫ్ లో సభ్యత్వం కలిగిన ఉపాధ్యాయులకు మాత్రమే వర్తిస్తుందని తెలియజేశారు. ఉపాధ్యాయుల సంక్షేమం ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం పనిచేస్తున్న సంఘంగా రాష్ట్రంలో అగ్రగామి ఉపాధ్యాయ సంఘంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ డి.దాసు, జిల్లా కార్యదర్శి ఎస్ కే యాకూబ్ పాషా, ములకలపల్లి మండల అధ్యక్షులు బి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎం కిషోర్, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ డి.కోట్యా,కోశాధికారి కె.శ్రీరామ్ సహాధ్యక్షులు కె.సంతోష్ కుమార్, పి.జానకి దేవి,కార్యదర్శులు కె.మల్లయ్య, కె.వెంకటేశ్వర్లు, కె.కష్ణ తదితరులు పాల్గొన్నారు.