డ్రగ్స్ రహిత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి
సిద్దిపేట క్రైం, నవంబర్ 16: మాదకద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని న్యాయవాదులు ఎస్.రాజేష్, బి.రమేశ్ పిలుపునిచ్చారు. సిద్దిపేట డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అధ్వర్యంలో సోమవారం సిద్దిపేటలోని బీసీ స్టడీ సర్కిల్లో డ్రగ్ అవేర్నెస్ అండ్ వెల్నెస్ నావిగేషన్ ఫర్ డ్రగ్ ఫ్రీ ఇండియా స్కీంలో భాగంగా లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాం(Legal Awareness Program) నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్.రాజేష్, బి.రమేశ్ హాజరై మాట్లాడారు.
సమాజంలో మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యంతోపాటు కుటుంబ వ్యవస్థ, సామాజిక జీవనంపై కూడా ప్రతికూల ప్రభావాలు పడతాయని వివరించారు. యువత తమ జీవిత లక్ష్యాలపై దృష్టి సారించి, విద్య, క్రీడలు, సత్ప్రవర్తనతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కృష్ణదయాసాగర్, న్యాయసేవ సిబ్బంది పాల్గొన్నారు.