సాగునీటి కోసం రైతు ప్రాణ త్యాగ యత్నం!
వారం రోజులుగా అధికారుల చుట్టూ తిరిగినా స్పందన కరువు..
అధికార పార్టీ అండతో అన్యాయం జరుగుతోందని రైతు ఆవేదన
కోటపల్లి, (విజయక్రాంతి): అన్నదాతకు సాగునీరు అందించాల్సిన అధికారులు తమ బాధ్యతను విస్మరిస్తున్నారా? న్యాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకునే నాథుడే లేకపోవడంతో ఓ రైతు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మంచిర్యాల జిల్లా(Mancherial district) కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన రైతు వేమూగంటి సమ్మిరెడ్డి సాగునీటి సమస్యతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
గ్రామంలోని చెరువు నీటిని కింద ఉన్న పొలాలకు మళ్లించకుండా కొందరు రైతులు అడ్డుకుంటున్నారని, అధికార పార్టీకి చెందిన వారి అండదండలతో తనకు అన్యాయం జరుగుతోందని సమ్మిరెడ్డి ఆరోపిస్తున్నాడు. తన పొలానికి సాగునీరు అందించాలని కోరుతూ గత వారం రోజులుగా సంబంధిత అధికారుల చుట్టూ తిరిగినా కనీస స్పందన లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చివరకు ఆవేదనతో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకునేందుకు యత్నించినట్లు సమాచారం.