చిట్యాలలో నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ
పాల్గొన్న ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.
చిట్యాల, నవంబర్ 16 (విజయ క్రాంతి): చిట్యాల మున్సిపాలిటీ(Chityala Municipality) పరిధిలో ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను సోమవారం చిట్యాల వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(MLA Vemula Veeresham) లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా కొత్త పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ విడతలో వికలాంగులు, చేనేత కార్మికులు, వితంతువులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలకు పింఛన్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ, వాటిని భరిస్తూ ప్రస్తుత ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు ప్రయాణం,
200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. చిట్యాల మున్సిపాలిటీకి నూతన భవనాన్ని మంజూరు చేసినట్లు, త్వరలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌తో పాటు 30 పడకల ఆసుపత్రిని కూడా మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నర్రా వినోద్ మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, కౌన్సిలర్లు నాగిళ్ల సుధాకర్, గాలి యాదమ్మ లింగయ్య, కోనేటి ఎల్లయ్య, జెర్రిపోతుల సత్యనారాయణ, దేశపాక లత రాజేష్, కుక్కుల మోహన్, ఏర్పుల పరమేష్, బొబ్బలి సందీప్ రాంరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పోకల దేవదాస్, టౌన్ అధ్యక్షుడు ఎద్దులపూరి కృష్ణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.