పరేడ్‌కు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల ఎంపిక

16-11-2026 | 07:45pm

ఘట్ కేసర్, నవంబర్ 16 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీలో(Anurag University) నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం(National Service Scheme) (ఎన్ఎస్ఎస్) ప్రీ రిపబ్లిక్ డే క్యాంప్ – 2026లో భాగంగా, 2027 జనవరి 26న న్యూఢిల్లీలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు అర్హులైన, ప్రతిభావంతులైన ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లను ఎంపిక చేసే ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది.

ఈఎంపిక ప్రక్రియను నిర్వహించేందుకు కేంద్ర స్థాయి ఎంపిక కమిటీ సభ్యులు అనురాగ్ యూనివర్సిటీకి విచ్చేశారు. ఎంపిక కమిటీలో ప్రీ రిపబ్లిక్ డే క్యాంప్ డైరెక్టర్ ఆర్ సైదా (హైదరాబాద్), కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ కమల్ కుమార్ కర్ (అహ్మదాబాద్), కేంద్ర ఎంపిక కమిటీ సభ్యులు డాక్టర్ అశోక్ శ్రోతి  (భోపాల్) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపిక కమిటీ సభ్యులకు ప్రీ రిపబ్లిక్ డే క్యాంప్ – 2026 కోఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేష్ ఘనంగా స్వాగతం పలికారు.

దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఈ శిబిరానికి హాజరైన ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లలో పరేడ్‌కు అవసరమైన శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, మార్చింగ్ నైపుణ్యాలు, సమన్వయం, అంకితభావం వంటి అంశాలను పరిశీలించి ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు.

ఈఎంపిక ప్రక్రియ ద్వారా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లు తదుపరి దశలకు ఎంపికై, దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగే ప్రతిష్ఠాత్మక గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనే అవకాశాన్ని పొందనున్నారు.

మరిన్ని వార్తలు