పట్ట భద్రుల తక్కెడలో పార్టీలు!

15-11-2026 | 05:10am

ప్రభావిత ఎన్నికల్లో ఫలితాలు ఎవరికి లాభం? 

ఎన్నిక ఏదైనా గెలిచిన పార్టీలో విశ్వాసం ఓడిన పార్టీలో నైరాశ్యం నెలకొంటుంది. ఇటీవల భారత్‌లో ఐదు రాష్ట్రాల్లో 28 పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో ముఖ్యంగా 2027 ప్రథమర్ధంలో శాసనసభ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీలు పోటాపోటీగా విజయం నమోదు చేశాయి. ఎస్‌పి ఐదు స్థానాల్లో గెలవడం ఆ పార్టీకి శాసనసభ ఎన్నికలపై ధీమా పెరిగింది.

తెలంగాణలో కూడా 77 శాసనసభ స్థానాల పరిధిలోకి వచ్చే నల్లగొండ వరంగల్, హైదరాబాద్  రంగారెడ్డి  మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు 2027 మార్చిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన ప్రధాన పార్టీలు.. ప్రచారం కూడా ప్రారంభించాయంటే ఈ ఎన్నికలు ఎంత ప్రాధాన్యత కలిగినవో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు అవుతున్న నేపథ్యం.. శాసనసభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నికలు కావడం.. ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై, పార్టీలపై ప్రభావం చూపెట్టబోతున్నాయి.

2022లో ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తేలికగా తీసుకోవడంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ దారుణంగా ఓటమిపాలైన అనుభవాల దృష్ట్యా తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి.

కాంగ్రెస్‌కు కీలకం..

తెలంగాణ ఏర్పాటైన తరువాత మొదటిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికలలో మిశ్రమ ఫలితాలు సాధించినా, కంటోన్‌మెంట్, జూబ్లీహిల్స్ శాసనసభ, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలిచీ, కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయింది. నల్లగొండ ఉప ఎన్నికలో గెలిచినప్పటికీ.. శాసనమండలి పునరుద్ధరణ జరిగిన తర్వాత ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నాలుగుసార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఒక్కసారి కూడా గెలుపునందుకోలేదు.

2021 ఎన్నికలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు కనీస స్థాయిలో కూడా పోటీ ఇవ్వలేకపోయారు. ఇక ప్రస్తుతం వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న నల్లగొండ, హైదరాబాద్ పట్టభ ద్రుల స్థానాల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో అన్ని పార్టీల కంటే ముందుగానే కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించింది. అయితే, అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించలేదని, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో గెలుపుపై ఆ ప్రభావం పడుతుందనే అనుమానాలు పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతున్నాయి. పైగా ముఖ్యమత్రి, ఉపముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే జిల్లాల్లో జరుగుతున్న ఎన్నికలివి. ఒకవేళ గెలవలేకపోతే పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే.. రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని బలహీనపరిస్తుంది. అందుకే ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ సర్వశక్తులు ధారపోసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే టీజేఎస్, వామపక్షాల మద్దతు కోరిన కాంగ్రెస్ వ్యూహాత్మంగా అడుగులు వేస్తోంది.

అక్కడ వారు.. ఇక్కడ వీరు!

ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే ఈ రెండు నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలపై ఊహాగానాలు ఊహల్లో తేలియాడుతున్నాయి. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ బలం ఉంది.. 2015లో గెలిచింది. 2021లో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయింది. అలాగే నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నాలుగు సార్లు విజయం సాధించింది.

2024 ఉప ఎన్నికలో ఓడిపోయినా అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాదులో బీజేపీకి, నల్లగొండలో బీఆర్‌ఎస్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువుంటాయనే ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు, ఈ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకొని కాంగ్రెస్‌ను ఓడించే వ్యూహం పన్నుతున్నారనే అనుమానాలు కాంగ్రెస్ ఆంతరంగిక సంభాషణల్లో వ్యక్తమవుతున్నది. బీఆర్‌ఎస్, బీజేపీ వ్యూహం ఫలిస్తే.. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ బలహీన పడుతుందనే చర్చ జరుగుతున్నది.

కొత్త పార్టీలకు అదృష్ట పరీక్ష!

రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త పార్టీలు,చిన్న పార్టీలు రాజకీయంగా తమ సత్తా చాటటానికి, నిలదొక్కుకోవడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను అందొచ్చిన అవకాశంగా భావిస్తున్నాయి. టీఆర్పీ, టీఆర్‌ఎస్, జనసేన పార్టీలు అభ్యర్థులను  ప్రకటించి ప్రచారం సైతం మొదలెట్టాయి. ప్రధాన పార్టీలకు దీటుగా ఈ పార్టీలు గెలుపే లక్ష్యమంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో 2021, 2024 ఎన్నికల నేపథ్యంలో బలమైన ఓటు బ్యాంకు తయారు చేసుకున్న తీన్మార్ మల్లన్న.. 2024 లో జరిగిన ఉపఎన్నికలో 29వేల మొదటి ప్రాధాన్యతా ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచిన అశోక్ సార్‌ను టీఆర్పీ నుంచి పోటీకి దింపి తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

బీసీ వాదం కలిసొచ్చేదెవరికి? 

బీసీ వాదం ఈ ఎన్నికలలో ప్రధాన రాజకీయ అంశంగా కనిపిస్తున్నది. అందుకగుణంగా పార్టీలు సైతం అభ్యర్థుల ఎంపికలో సామాజిక వర్గాల లెక్కలేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ఈ రెండు స్థానాల్లో నాలుగు సార్లు జరిగిన ఎన్నికల్లో అగ్రవర్ణాలకు చెందిన వారే గెలిచారు. ఈ రికార్డును 2024లో తీన్మార్ మల్లన్న బద్దలు కొట్టారు. అది కూడా ఉప ఎన్నికలో. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ వాదం బలపడుతున్న నేపథ్యంలో ఆ వర్గం అభ్యర్థులను నిలబెట్టడానికి పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి.

టీఆర్పీ అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత అశోక్ సార్ నాతో మాట్లాడుతూ ‘పట్టభద్రుల సమస్యలపై ముఖ్యంగా నిరుద్యోగుల కోసం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నేను చేసిన కొట్లాట నాపై ప్రభు త్వం పెట్టిన 18 కేసులు, రెండుసార్లు జైలుకు పంపటంతోపాటు తీన్మార్ మల్ల న్న పాదయాత్ర, బీసీ వాదంతో నా గెలుపు సునాయాసమవుతుందని..’ విశ్వా సం వ్యక్తం చేశారు. అయితే, ఎవరు గెలిచినా! ఏ పార్టీ ఓడినా! ఎన్నికల ఫలితాలు రాష్ట్ర భవిష్యత్తు రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నాయి.

అసిస్టెంట్ ప్రొఫెసర్,సెల్ : 9885465877


మరిన్ని వార్తలు