సామాజిక మార్పా? ఓట్ల చీలికా?

15-11-2026 | 05:05am

భారత రాజకీయాలకు గుండెకాయ గా భావించే ఉత్తరప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల(Assembly elections) కోసం రాజకీయ సమీకరణాలు అప్పుడే వేగం పుంజుకున్నాయి. దేశంలో అత్యధిక జనాభా, అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన ఈ రాష్ర్టంలో జరిగే ప్రతి రాజకీయ పరిణామం జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపుతుంది. అం దుకే యూపీ ఎన్నికలు కేవలం ఒక రాష్ట్ర అధికార పోరాటం కాదు, దేశ రాజకీయ దిశను ప్రభావితం చేసే కీలక సమరంగా మారుతున్నాయి.

ఈ నేపథ్యంలో అఖిల భారత మజ్లిస్- ముస్లిమీ న్ (ఎంఐఎం), ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) కలిసి ఏర్పాటు చేసిన ‘సామాజిక్ పరివర్తన్ మోర్చా’ కొత్త రాజకీయ చర్చకు తెరలేపింది. ఎంఐఎం  అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఆజాద్ సమాజ్ పార్టీ అధినేత, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడం రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ కూ టమి నిజంగా ముస్లింలు,దళితులు, ఇతర అణగారిన వర్గాలకు ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదుగుతుందా? లేక ఇప్పటికే ఉన్న బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకును మ రింతగా విభజిస్తుందా? అన్నదే ప్రశ్న.

కొత్త కూటమి వెనుక..

భారత రాజకీయాల్లో ముస్లిం-- దళిత ఐక్యత అనేది కొత్త ఆలోచన కాదు. సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ, అణ గారిన వర్గాల హక్కుల వంటి అంశాలు ఈ రెండు వర్గాలను ఒక రాజకీయ వేదికపైకి తీసుకురావాలనే ప్రయత్నాలు గతంలో కూడా జరిగాయి. అయితే ఉత్తరప్రదేశ్ వం టి సంక్లిష్టమైన సామాజిక నిర్మాణం ఉన్న రాష్ర్టంలో ఇలాంటి సమీకరణ ఎన్నికల విజయంగా మారడం అంత ఈజీ కాదు.

చంద్రశేఖర్ ఆజాద్ యువ దళిత నాయకుడిగా తనకంటూ ప్రత్యేక రాజకీయ గుర్తిం పు సంపాదించుకున్నారు. మరోవైపు అసదుద్దీన్ ఒవైసీ ముస్లిం రాజకీయాల్లో బల మైన స్వరం వినిపిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు కలిసి రావడం సామాజికంగా కొత్త రాజకీయ అవకాశాలను సృష్టించవచ్చు. కానీ, ఎన్నికల రాజకీయాల్లో కేవలం సామాజిక సమీకరణ సరిపోదు. విస్తృత స్థాయి సంస్థాగత నిర్మా ణం, గ్రామస్థాయి నాయకత్వం, అభ్యర్థుల ఎంపిక,  వెనుకబడిన వర్గాల మద్దతు  కూడా కీలకం.

బీజేపీకి పరోక్ష లాభమా? 

ఈ కూటమిపై కాంగ్రెస్ నాయకుడు హుస్సేన్ దల్వాయి చేసిన విమర్శలు రాజకీయంగా కీలకమైన ప్రశ్నను ముందుకు తెచ్చాయి. ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఉన్నప్పుడు, కొత్తగా ప్రత్యేక కూటమి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నను ఆయన లేవనె త్తారు. భారత ఎన్నికల వ్యవస్థలో అనేక సందర్భాల్లో ఓట్ల విభజన విజేతను నిర్ణయించే ప్రధానాంశంగా మారుతుంది.

ఒక నియోజకవర్గంలో బీజేపీ వ్యతిరేక ఓట్లు రెండు లేదా మూడు పార్టీల మధ్య చీలిపోతే, తక్కువ ఓట్ల తేడాతో అధికార పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతిపక్ష ఐక్యత అనేది కేవలం రాజ కీయ నినాదం కాదు, ఎన్నికల గణితంలో కీలకమైన వ్యూహం. అయితే ప్రతి కొత్త పార్టీ లేదా కూటమిని వెంటనే ‘బీజేపీకి సహాయక శక్తి’గా ముద్ర వేయడం కూడా ప్రజాస్వామ్యపరంగా సరైన విశ్లేషణ కాదు. ఒక స్వతంత్ర రాజకీయ వేదిక ఏర్పడటానికి ఆ పార్టీకి తనదైన సామాజిక, రాజకీ య కారణాలుండొచ్చు. అసలు ప్రశ్నేంటంటే ఈ కూటమి బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తులను బలోపేతం చేస్తుందా? లేక ఓట్లు చీల్చి బలహీనపరుస్తుందా? దీనికి సమా ధానం ఎన్నికల ఫలితాలే చెబుతాయి.

ఆరోపణలు, ప్రశ్నలు 

మజ్లిస్, బీజేపీల మధ్య రాజకీయ సంబంధాలపై విమర్శలు, అనుమానాలు గతంలోనూ వినిపించాయి. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సం స్థల చర్యల విషయంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చల నేపథ్యంలో, కొన్ని పార్టీలు లేదా నాయకులపై చర్యలెందుకు జరుగుతున్నాయి?, మరికొందరిపై ఎం దుకు జరగడం లేదు? అనే ప్రశ్నలు ప్రజ ల్లో సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి.

అయితే ఇటువంటి ప్రశ్నలకు కేవలం రాజకీయ అనుమానాలాధారంగా తుది తీర్పు ఇవ్వడం సరికాదు. ఏ పార్టీపై, ఏ నాయకుడిపై వచ్చిన ఆరోపణలనైనా చట్టపరమైన ఆధారాలు, దర్యాప్తు సంస్థల నిర్ధారణలు, న్యాయస్థానాల తీర్పుల ఆధారంగానే పరిశీలించాలి. ప్రజాస్వామ్యంలో రాజకీయ ఆరోపణలు ఒక భాగం.

కానీ, ఆరోపణలను వాస్తవాలుగా మార్చేది సాక్ష్యాధా రాలే. అయినప్పటికీ రాజకీయ పోరాటంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూనే కొన్ని సందర్భాల్లో పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు ప్రజ ల్లో కలగడం రాజకీయ పార్టీలకు ఒక హె చ్చరికగా భావించాలి. పారదర్శకత, రాజకీయ స్థిరత్వం లేకపోతే ఇలాంటి సందేహాలకు మరింత బలం చేకూరుతుంది.

సామాజిక సమీకరణలు

బీజేపీ రాజకీయ ఎదుగుదలలో హిం దుత్వ రాజకీయాలు ఒక ప్రధానాంశంగా మారాయి. మతపరమైన గుర్తింపులు, జాతీయత, భద్రత వంటి అంశాలు ఎన్నికల చర్చల్లో ప్రధాన స్థానాన్ని ఆక్రమి స్తు న్నాయి. మరోవైపు ముస్లింలు, దళితులు, వెనుకబడిన వర్గాల రాజకీయ ప్రాతిని ధ్యం, భద్రత, సామాజిక న్యాయం వంటి అంశాలు ప్రతిపక్ష రాజకీయాలకు కేంద్ర బిందువులుగా ఉన్నాయి.

ఈ పరిస్థితిలో చిన్నచిన్న రాజకీయ శక్తులు విడివిడిగా పోటీ చేయడం వల్ల సెక్యులర్ ఓట్లు చీలిపోతాయనే ఆందోళనకు రాజకీయ ప్రాధా న్యతుంది. అదే సమయంలో సంప్రదాయ సెక్యులర్ పార్టీలు తమకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని భావించే వర్గాలు కొత్త రాజకీయ వేదికల వైపు చూడడం  సహజమే. కాబట్టి సమస్య కేవలం ‘ఎవరు ఎవరికి బీ టీమ్?’ అనే ఆరోపణకు పరిమితం కాదు. అసలు ప్రశ్న ---ప్రస్తుత రాజకీ య కూటములు ముస్లిం, దళితు, వెనుకబడిన వర్గాల ఆకాంక్షలను ఎంతవరకు ప్రతిబింబిస్తున్నాయి? నిజమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తున్నాయా? అన్నదే.

అంతిమ తీర్పు ఓటరుదే  

‘సామాజిక్ పరివర్తన్ మోర్చా’ ఏర్పాటును రాజకీయ వ్యూహంగా చూడవచ్చు. అది సామాజిక మార్పుకోసం ఏర్పడిన ప్రత్యామ్నాయ వేదికా? లేక ఎన్నికల ఓట్ల గణితంలో మరో విభజనకు కారణమయ్యే కూటమా? అన్న ప్రశ్నకు ఇప్పుడే తుది సమాధానం సాధ్యం కాదు. చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వం దళిత యువతను ఎంతవరకు ఆకర్షిస్తుంది? మజ్లిస్ తన సం ప్రదాయ మద్దతును ఉత్తరప్రదేశ్‌లో ఎంతవరకు విస్తరించగలుగుతుంది?

సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ వంటి ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ కొత్త రాజకీయ సమీకరణాన్ని ఎలా ఎదుర్కొంటాయి? ఇవన్నీ రాబోయే నెలల్లో స్పష్టమవుతాయి. అయితే ఒక విషయాన్ని మాత్రం విస్మరించలేం. బీజేపీని ఓడించడమే లక్ష్యమైతే ప్రతిపక్షాల మధ్య ఐక్యత, పరస్పర అవగాహన, సామాజిక సమీకరణలపై స్పష్టమైన వ్యూహం అవసరం.అదే సమయంలో అణగారిన వర్గాల స్వతంత్ర రాజకీయ స్వరాన్ని అణచివేయకుండా, వారిని విస్తృత ప్రజాస్వామ్య పోరాటంలో భాగస్వాములను చేయడం అంతే ముఖ్యం. మొత్తానికి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఒక కొత్త రాజ కీయ పరీక్షకు వేదిక కానున్నాయి.

‘సామాజిక్ పరివర్తన్ మోర్చా’ నిజంగా సామాజిక పరివర్తనకు నాంది పలుకుతుందా? లేక ప్రతిపక్ష ఓట్ల చీలికకు మరో కారణమవుతుందా? అన్నది ఎన్నికల ఫలితాలతో తేలనుంది. ఈ ప్రశ్నలకు  రాజకీయ నాయకులు వాదనలు కాదు.. ఓటర్ల తీర్పే సమాధానం చెప్పనుంది. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ఏ కూట మి నిజమైన మార్పును కోరుకుంటుందో, ఏది ఓట్ల రాజకీయాల కోసం ఏర్పడిందో, ఏది సామాజిక మార్పునకు దోహదపడుతుందో నిర్ణయించేది ప్రజలే.

  వ్యాసకర్త: 9989988912


మరిన్ని వార్తలు