నెలకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలి

16-11-2026 | 07:02pm

సిఐటియు జగిత్యాల జిల్లా కార్యదర్శి కోమటి చంద్రశేఖర్

జగిత్యాల, నవంబర్ 16 ( విజయ క్రాంతి ): ఆశా వర్కర్లకు రూ.18,000 లు ఫిక్స్డ్ వేతనం(Fixed remuneration) నిర్ణయించాలి. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జగిత్యాల జిల్లా(CITU Jagtial District) కార్యదర్శి కోమటి చంద్రశేఖర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

ఈ రోజు జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జగిత్యాల జిల్లా కార్యదర్శి కోమటి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆశా వర్కర్లు 28 వేల మంది గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. వీరంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళలు.

రూరల్ 1,000, పట్టణంలో 2,000 నుండి 5,000 మంది ప్రజలకు ఆశాలు సేవలందిస్తున్నారు. గర్భిణీలు ఆసుపత్రిలో డెలివరీ అయ్యే విధంగా చూస్తూ తల్లి, బిడ్డ ప్రాణాలను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. దీంతోపాటు సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులను అరికడుతున్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ఆశాలు కీలకపాత్ర పోషించారు.

డబ్ల్యూహెచ్ఓ ఆశాలను గ్లోబల్ లీడర్స్ అని ప్రకటించింది. ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు సబ్ సెంటర్ డ్యూటీలు, ఏఎన్సీ, పిఎన్సీ, టార్గెట్స్, ఎన్సీడి ఆన్లైన్ సర్వే, స్పూటమ్ డబ్బాలను మోయడం, ఎగ్జామ్ డ్యూటీలు, డ్రైడే, ఫ్రైడే లెప్రసీ, పల్స్ పోలియో తదితర అనేక పనులు ఉదయం నుండి రాత్రి వరకు చేస్తున్నారు.

ఇంత శ్రమ చేస్తున్న ఆశాలకు నేటికీ రాష్ట్రంలో ఫిక్స్డ్ వేతనం లేదు. కేవలం రూ.9,900 లు మాత్రమే పారితోషికాలు చెల్లిస్తున్నారు. ఇతర ఏ సౌకర్యాలు లేవు. 5 సంవత్సరాల నుండి పారితోషికాలు పెరగలేదు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పని భారం పెరిగి వచ్చే పారితోషికాలు సరిపోక ఆశాలు అనేక ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఆశాలు సమస్యల పరిష్కారం కోసం 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులు నిరవధిక సమ్మె చేశారు. సమ్మె సందర్భంగా అక్టోబర్ 9న హైదరాబాద్ కోరి కమీషనర్ ఆఫీస్ ముందు జరిగిన ధర్నా సందర్భంగా గత ప్రభుత్వం ఆనాటి ఉన్నతాధికారులు నాయకులతో చర్చలు జరిపారు. ఆశాల సమస్యల పరిష్కారం కోసం ఐఏఎస్ తో కూడిన కమిటీని వేస్తామని, ఆ 

కమిటీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆశాలకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీనిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు ఆశాలు చేస్తున్న పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని మేము అధికారంలోకి వస్తే ఆశాలు అడుగుతున్న డిమాండ్స్ అన్నింటినీ పరిష్కారం చేస్తామని హామీనిచ్చారు.

ఆశాలకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రాష్ట్రంలో ఆశాల వర్కర్లు మోసం చేశాయని అన్నారు. ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ఆ పోరాటాలకు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ వహించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ రైతుల జిల్లా కార్యదర్శి రాయికంటి దివ్య, జిల్లా కోశాధికారి మెట్టు మమత, బి. ప్రేమలత ఏం.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు