నేరాల నియంత్రణలో, ఛేదనలో సీసీ కెమెరాలు అత్యంత కీలకం
ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల, నవంబర్ 16 (విజయక్రాంతి): శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, నేరాల ఛేదనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా మెట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 5 గ్రామంలో ఏర్పాటు చేసిన 35 సీసీ కెమెరాలను, పోలీస్ స్టేషన్ కి అనుసంధానం చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్(SP Ashok Kumar) మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సీసీ కెమెరాలు ప్రతి గ్రామానికి, ప్రతి కాలనీకి, ప్రతి వ్యాపార సంస్థకు అదనపు భద్రతను కల్పించే సమర్థవంతమైన సాధనంగా మారాయని అన్నారు. నేరాలను అరికట్టడంలో, నేరస్థులను గుర్తించి త్వరితగతిన పట్టుకోవడంలో సీసీ కెమెరాల ద్వారా లభించే దృశ్యాలు అత్యంత కీలకమైన ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు.
ప్రతి గ్రామం, పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రహదారులు, మార్కెట్ ప్రాంతాలు, వ్యాపార సముదాయాలు, రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల నేరాలకు పాల్పడే వ్యక్తుల్లో భయాందోళనలు ఏర్పడి నేరాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుందని వివరించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు, చోరీలు, గొడవలు, జరిగే నేరాలు మరియు ఇతర సంఘటనల విచారణలో సీసీ కెమెరాల ఫుటేజీ కీలక సాక్ష్యంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజలు తమ వ్యక్తిగత భద్రతతో పాటు తమ రక్షణ కోసం ప్రతి ఇల్లు, వ్యాపార సంస్థ, దుకాణం, అపార్ట్మెంట్, ఇతర ప్రాంగణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
మెట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జగ్గసాగర్ (10), మెట్ల చిట్టాపూర్ (06), అరపేట (04), విటం పేట (09), బంతుపేట్(06) గ్రామంలో ఏర్పాటు చేసిన 35 సీసీ కెమెరాలు గ్రామ భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే డయల్-112 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాములు, ఇన్స్పెక్టర్ లు సురేష్ బాబు, శ్రీనివాస్, ఎస్.ఐ లు కిరణ్ కుమార్, రాజు నాయక్, శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.