భూ హద్దుల నిర్ధారణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు

19-11-2026 | 07:31pm
  1. రైతుల భూముల హద్దులు పక్కాగా నిర్ధారించాలి...
  2. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్...

బాన్సువాడ, నవంబర్ 19 (విజయ క్రాంతి): భూ సంబంధిత వివాదాలకు(land-related disputes), హద్దుల నిర్ధారణలో శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రైతులు, పట్టాదారుల భూముల హద్దులను పక్కాగా నిర్ధారించేందుకు ప్రభుత్వం చేపట్టిన రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(District Collector Ashish Sangwan) అధికారులను ఆదేశించారు.

గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల పరిధిలోని వాసుదేవపల్లి రెవెన్యూ గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే, గ్రామ సరిహద్దుల నిర్ధారణ పనులను  జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే నిర్వహిస్తున్న తీరును, భూముల హద్దుల గుర్తింపు ప్రక్రియను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గ్రామంలోని ప్రతి రైతు, పట్టాదారుడికి సంబంధించిన భూముల సరిహద్దులు, విస్తీర్ణాన్ని క్షేత్రస్థాయిలో కచ్చితంగా గుర్తించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రస్తుత రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేశారు.

రీ-సర్వే ప్రక్రియలో పారదర్శకత, కచ్చితత్వం అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. భూముల హద్దుల విషయంలో భవిష్యత్తులో రైతుల మధ్య వివాదాలు తలెత్తకుండా ప్రతి సర్వే నంబరుకు సంబంధించిన వివరాలను సమగ్రంగా పరిశీలించి నమోదు చేయాలని ఆదేశించారు. రైతులు, పట్టాదారులు సైతం తమ భూముల హద్దులు, విస్తీర్ణంపై స్పష్టత పొందేందుకు రీ-సర్వే ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సర్వే పనులను వేగవంతం చేస్తూనే, నాణ్యతలో రాజీ పడకుండా గ్రామ సరిహద్దుల నిర్ధారణ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి, తహసీల్దార్ రాజా నరేందర్ గౌడ్, ఉప సర్వేయర్ తిరుమలేష్, సర్వేయర్ మధు, లైసెన్స్ పొందిన సర్వేయర్లు సాజిద్, అలీం ఖాన్, గిర్దావర్ రాజు, జూనియర్ సహాయకుడు, గ్రామ ప్రణాళిక అధికారి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు