రెండు ఎకరాల హద్దుల కోసం లక్ష రూపాయల డిమాండ్?
పట్టా పాస్‌బుక్ ఉన్నా హద్దులు చూపించని అధికారులు.. పలుమార్లు ఫిర్యాదు చేసిన బాధితుడు
జుక్కల్, నవంబర్ 16 (విజయక్రాంతి): ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా భూమికి హద్దులు చూపించేందుకు సర్వేయర్, జీపీఓ కలిసి లక్ష రూపాయలు డిమాండ్ చేశారంటూ జుక్కల్ మండలం(Jukkal Mandal) బస్వాపూర్ గ్రామనికి చెందిన వైజనాథ్ అనే బాధితుడు ఆరోపిస్తున్నారు. తనకు ప్రభుత్వం అధికారికంగా రెండు ఎకరాల పట్టా పాస్‌బుక్ మంజూరు చేసిందని, అయితే భూమి హద్దులు చూపించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వే నంబర్ 37/1లో మొత్తం 22 ఎకరాల భూమి ఉండగా, అందులో సుమారు 18 ఎకరాలు ఇతరుల కబ్జాలో ఉన్నాయని, మిగిలిన నాలుగు ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగా ఉందని సర్వేలో తేలినట్లు పేర్కొన్నారు. ఈ నాలుగు ఎకరాల్లో తనకు ప్రభుత్వం రెండు ఎకరాల పట్టా పాస్‌బుక్ మంజూరు చేసిందని తెలిపారు. తనకు మంజూరైన రెండు ఎకరాల భూమి హద్దులు చూపించాలని సర్వేయర్‌ను సంప్రదించగా, సర్వే నిర్వహించిన సమయంలో నాలుగు ఎకరాల అదనపు విస్తీర్ణం ఉన్నట్లు గుర్తించినట్లు బాధితుడు చెబుతున్నారు.
అయితే రెండు ఎకరాల హద్దులు చూపించేందుకు సర్వేయర్‌తో పాటు జీపీఓ కలిసి రూ.లక్ష డిమాండ్ చేశారని ఆయన ఆరోపించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నందున తనకు సాధ్యమైనంత మొత్తాన్ని ఇస్తానని చెప్పినా, పూర్తి మొత్తం ఇవ్వకపోతే హద్దులు చూపించబోమని చెప్పినట్లు బాధితుడు పేర్కొన్నారు. ఈ విషయంపై బాధితుడు ఏప్రిల్ 4, 2026న తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. అయితే తనకు ఎలాంటి రసీదు లేదా స్పష్టమైన సమాధానం అందలేదని ఆరోపించారు.
అనంతరం ఏప్రిల్ 21న బాన్సువాడ సబ్‌కలెక్టర్‌ను కలిసి సమస్యపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అక్కడి నుంచి కూడా స్పందన రాకపోవడంతో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సర్వేయర్, జీపీఓ కలిసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే విషయాన్ని ప్రజావాణి దరఖాస్తులో పేర్కొన్నట్లు బాధితుడు తెలిపారు. ప్రజావాణి ఫిర్యాదు అనంతరం సంబంధిత అధికారులు సర్వే చేసి హద్దులు చూపించాలని ఆదేశించినప్పటికీ, మొదట సర్వేయర్ హద్దులు చూపించేందుకు రాలేదని ఆయన ఆరోపించారు.
అనంతరం జూన్ 26, 2026న సర్వే నంబర్ 37/1లో మళ్లీ సర్వే నిర్వహించగా, మొత్తం 22 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లు, అందులో 18 ఎకరాలు ఆక్రమణలో ఉండగా నాలుగు ఎకరాల భూమి మిగిలి ఉన్నట్లు సర్వేలో వెల్లడైనట్లు బాధితుడు పేర్కొన్నారు. అయినప్పటికీ తనకు మంజూరైన రెండు ఎకరాల భూమి హద్దులు చూపించేందుకు మళ్లీ లక్ష రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆయన ఆరోపించారు. ఈ విషయంపై మరోసారి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో, సర్వేయర్ తన బదిలీ కోసం దరఖాస్తు చేసుకుని వేరే మండలానికి బదిలీ అయ్యారని బాధితుడు తెలిపారు.
పంచనామాలో మరో సర్వే నంబర్ ప్రస్తావనపై అభ్యంతరం
ప్రజావాణిలో చేసిన ఫిర్యాదుకు సంబంధించి సర్వేయర్ అక్టోబర్ 23, 2026న తహసీల్దార్‌కు పంచనామా సమర్పించినట్లు, అనంతరం అక్టోబర్ 26న తహసీల్దార్ చేతుల మీదుగా దాని ప్రతిని తనకు అందజేసినట్లు వైజనాథ్ తెలిపారు. అయితే ఆ పంచనామాలో తాను కోరిన సర్వే నంబర్ 37/1కు బదులుగా సర్వే నంబర్ 321ను ప్రస్తావించారని, సర్వే నంబర్ 321లో స్థలం లేదని చెబుతూ నివేదిక ఇచ్చారని ఆయన ఆరోపించారు.
తాను 37/1 సర్వే నంబర్లోని రెండు ఎకరాల భూమి హద్దుల కోసం ఫిర్యాదు చేస్తే, వేరే సర్వే నంబర్‌ను చూపించడం సరైనది కాదని బాధితుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తనకు తప్పుడు సమాచారం అందించారని ఆరోపిస్తూ నవంబర్ 16, 2026న మరోసారి ప్రజావాణిలో దరఖాస్తు సమర్పించినట్లు వైజనాథ్ తెలిపారు. ఇప్పటివరకు ఈ వ్యవహారంపై స్పష్టమైన చర్యలు తీసుకున్నట్లు తనకు సమాచారం లేదని, న్యాయం కోసం తహసీల్దార్ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారుల వివరణ ఇవ్వాల్సిన అవసరం :
ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా పాస్‌బుక్‌లో ఉన్న రెండు ఎకరాల భూమికి సంబంధించి, బాధితుడు పేర్కొంటున్న సర్వే నంబర్ 37/1లో వాస్తవ పరిస్థితి ఏమిటి? సర్వేలో నాలుగు ఎకరాల మిగులు భూమి ఉన్నట్లు నిర్ధారణ జరిగిందా? రెండు ఎకరాల హద్దులు చూపించేందుకు నిజంగానే రూ.లక్ష డిమాండ్ చేశారా? పంచనామాలో సర్వే నంబర్ 37/1కు బదులుగా 321ను ఎందుకు పేర్కొన్నారు? అనే అంశాలపై సంబంధిత రెవెన్యూ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. బాధితుడు చేసిన ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించడంతో పాటు, తనకు న్యాయం చేయాలని వైజనాథ్ కోరుతున్నారు.