బాన్సువాడ ఎంసీహెచ్‌లో ప్రపంచ అకాల జనన దినోత్సవం

16-11-2026 | 07:32pm
  1. అకాల జననాలపై తల్లులకు అవగాహన...
  2. నవజాత శిశువుల సంరక్షణపై వైద్యుల సూచనలు...

బాన్సువాడ, నవంబర్ 16 (విజయ క్రాంతి): అకాల జననాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, నెలలు నిండకముందే జన్మించిన శిశువులకు అందించాల్సిన ప్రత్యేక వైద్య సంరక్షణ(Specialized Medical Care) ప్రాముఖ్యతను తెలియజేసేందుకు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్‌)లో సోమవారం ప్రపంచ అకాల జనన దినోత్సవాన్ని నిర్వహించారు.

ఎంసీహెచ్ ప్రిన్సిపాల్ ఆనీ ప్రణుతి మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రోహిత్ కుమార్, ఆర్‌ఎంఓ డాక్టర్ ప్రకాష్, శిశు వైద్య నిపుణులు డాక్టర్ రథన్ సింగ్, సీనియర్ నర్సింగ్ అధికారులు అమృత, రుతు తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు అకాల జననాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

నర్సింగ్ విద్యార్థులు అకాల జననాలకు గల కారణాలు, ప్రమాద కారకాలు, శిశువులకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. నెలలు నిండకముందే జన్మించిన శిశువులను ముందుగానే గుర్తించి తగిన వైద్య చికిత్స అందించడం, నిరంతర పర్యవేక్షణ, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించడం ఎంతో అవసరమని వైద్యులు సూచించారు.

అదేవిధంగా తల్లులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, వైద్యుల సూచనల మేరకు గర్భధారణ సమయంలో అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని, నవజాత శిశువులకు తగిన పోషకాహారం, ప్రత్యేక సంరక్షణ అందించాలని పేర్కొన్నారు.కార్యక్రమంలో భాగంగా తల్లులకు అరటిపండ్లు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

అకాల జననాల నివారణతో పాటు, నెలలు నిండకుండానే పుట్టిన చిన్నారుల ప్రాణాలను కాపాడడంలో సరైన వైద్య సంరక్షణ, తల్లిదండ్రుల అవగాహన కీలకమని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, సీనియర్ నర్సింగ్ అధికారులు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు