యూనివర్సిటీ పరిరక్షణకు ఐక్య ఉద్యమాలను నిర్మిస్తాం

16-11-2026 | 07:29pm

కరీంనగర్ సిటీ నవంబర్16 (విజయక్రాంతి): శాతవాహన యూనివర్సిటీ(Satavahana University) పరిరక్షణ, అభివృద్ది, విద్యార్థుల సంక్షేమం కోసం ఐక్య ఉద్యమాలు నిర్మిస్తామని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ (బిఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు జక్కనపల్లి గణేష్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చల్ల హరి శంకర్ పిలుపునిచ్చారు.

సోమవారం శాతవాహన యూనివర్సిటీ గేట్ ముందు అఖిలపక్షం, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన అనంతరం వారు మాట్లాడారు. ప్రకృతి సిద్ధమైన ఆహ్లాదకర వాతావరణం కలిగిన శాతవాహన యూనివర్సిటీలోని మహావృక్షాలను పెకిలించి వేస్తున్నారని, కొన్ని మీటర్ల లోతుకు తవ్వి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థుల సంక్షేమానికి పాటుపడాల్సిన వైస్ ఛాన్స్లర్ ఉమేష్ కుమార్ శాతవాహన విధ్వంసానికి పాల్పపడుతున్నారన్నారు. పోలీస్ పహారాలో విద్యార్థులకు తరగతులు  నిర్వహించడం యూనివర్సిటీ అధికారుల నిరంకుశత్వానికి నిదర్శనం అన్నారు. శాతవాహన యూనివర్సిటీ అక్రమాలపై ప్రశ్నించిన విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు బనాయించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు.

యూనివర్సిటీలో మిగిలిపోయి ఉన్న పీజీ సీట్ ల భక్తికి స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించకుండా చోద్యం చూస్తున్నారన్నారు. తద్వారా సీట్లన్నీ ఖాళీగా మిగిలిపోయే అవకాశం ఉందని, అర్హత కలిగిన విద్యార్థులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ విధ్వంసానికి పాల్పడుతున్న వైస్ ఛాన్స్లర్, అందుకు సహకరిస్తున్న అధికారులపై ప్రభుత్వం వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌యూ జెఎసి చైర్మన్ కరికె మహేష్, దళిత రిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మార్వాడి సుదర్శన్, తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి గుర్రాల రవీందర్, ఎస్‌ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కాంపల్లి అరవింద్, ఎస్‌యూ అధ్యక్షుడు కేశవ్, ఏఐఎస్ఎఫ్ కన్వీనర్ శివాజీ, ఎస్‌ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు ఓంప్రకాష్, సాయి కిరణ్, లక్ష్మణ్ సాయి, రోహిత్, శ్రవణ్, రాకేష్, ఎస్‌యూ ఉపాధ్యక్షుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు