రాక్ క్లైంబింగ్ తో అలరించిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు
ముకరంపుర,(విజయక్రాంతి): హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లోని ధర్మశాలలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి అడ్వెంచర్ క్యాంపు(National level adventure camp)లో శాతవాహన విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం వాలంటీర్లు క్యాంపులో భాగంగా రెండవ రోజు నిర్వహించిన కృత్రిమ పర్వతారోహణ శిక్షణలో కంటింజెంట్ లీడర్ డాక్టర్ కె. అర్జున్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు అద్వైత్, అజయ్, శ్రీకాంత్, సంతోష్, ఓం ప్రకాష్, అనిత, మనీషా, దివ్య, నందిని, తేజశ్రీ ఎంతో ధైర్యసాహసాలతో రాక్ క్లైంబింగ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఎత్తైన శిఖరాలను అధిరోహించడం ద్వారా విద్యార్థులలో భయాన్ని పోగొట్టి మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించవచ్చని పేర్కొన్నారు.
అంతేకాకుండా, క్లిష్ట పరిస్థితులలో తక్షణమే సరైన నిర్ణయాలు తీసుకునే సమస్య పరిష్కార నైపుణ్యాలను, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవడంతో పాటు తోటి వాలంటీర్లకు అండగా నిలుస్తూ పరస్పర సహకారంతో ముందుకు సాగే బృంద స్ఫూర్తిని పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. జాతీయ వేదికపై శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు కనబరుస్తున్న ప్రతిభ, క్రమశిక్షణ పట్ల క్యాంపు నిర్వాహకులు ప్రత్యేక ప్రశంసలు కురిపించారు.