సభ్యత్వం అంటే పైసల సేకరణ కాదు

16-11-2026 | 07:30pm

దారం శ్రీనివాసరెడ్డి

ముకరంపుర, నవంబర్ 16 (విజయక్రాంతి): టీఎన్జీవోల సంఘంలో సభ్యత్వం అంటే పైసల సేకరణ కాదని టిఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి(TNGOS District President Daram Srinivas Reddy) అన్నారు. కరీంనగర్‌ లోని మాతా శిశు ఆసుపత్రిలో సోమవారం భోజన విరామ సమయంలో టీఎన్జీవోల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు, ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి హాజరై నర్సింగ్ ఆఫీసర్లు, నర్సింగ్ సూపరింటెండెంట్లకు సభ్యత్వాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఎన్జీవోల సంఘంలో సభ్యత్వం అంటే కేవలం పైసల సేకరణ కాదు… గుణగణాలున్న ఉద్యోగులను, నిబద్ధత కలిగిన నాయకులను, హక్కుల కోసం పోరాడే యోధులను సమీకరించడం అని అన్నారు.  టీఎన్జీవోల సంఘం ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి  కృషి చేస్తోందని పేర్కొన్నారు.

నర్సింగ్ ఉద్యోగులు సాధారణ ఉద్యోగులు కాదు…కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ, తమ ప్రాణాలను సైతం పణంగాపెట్టి ప్రజలకు వైద్య సేవలందించిన మహోన్నత సేవకులని కొనియాడారు. మీ సేవలకు, హక్కులకు సంఘం అండగా నిలుస్తుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సంగేం లక్ష్మణరావు, జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు