పారిశుద్ధ్యం, ట్రాఫిక్ సమస్యలపై కమిషనర్ తనిఖీలు
చెత్త పేరుకుపోకుండా చర్యలు.. రోడ్ల గుంతల మరమ్మతులకు ఆదేశాలు
మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్ పరిధిలో పారిశుద్ధ్యం, ట్రాఫిక్ సమస్యలు, రహదారుల అభివృద్ధిపై మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి(Municipal Corporation Commissioner Vinay Krishna Reddy) ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం డిప్యూటీ కమిషనర్ ఎ.శైలజ(Deputy Commissioner A. Sailaja)తో కలిసి సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెత్త పేరుకుపోయే ప్రాంతాలను పరిశీలించి, నిరంతర పర్యవేక్షణతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అవసరమైన చోట రోడ్ల విస్తరణ, బెల్మౌత్ల వెడల్పు పనులు చేపట్టాలని సూచించారు. విద్యుత్ స్తంభాలపై ఉన్న నిరుపయోగ కేబుల్ వైర్లను తొలగించాలని, సర్కిల్ పరిధిలోని బీటీ రోడ్ల గుంతలను జెట్ ప్యాచెస్ విధానంలో మరమ్మతు చేయాలని ఆదేశించారు. పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఏసీపీ ఈ. నాగిరెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాకేష్, ఏఈ సాయికిరణ్, ఎస్డబ్ల్యూఎం ఏఈ మహేష్ తదితరులు పాల్గొన్నారు.