భూ కబ్జాదారుడిపై పీడీ చట్టం ప్రయోగం
నిందితుడు రిమాండ్
ఘట్ కేసర్, నవంబర్ 14 విజయక్రాంతి : భూకబ్జాకు(Land Grabbing) పాల్పడిన వ్యక్తిపై ప్రివెంటివ్ డిటెన్షన్(Preventive Detention) (పీడీ) చట్టాన్ని ప్రయోగించారు. నిందితుడి కార్యకలాపాల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి(Malkajgiri Police Commissioner B. Sumathi) పీడీ చట్టం ప్రయోగించి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పల్ రాఘవేంద్ర కాలనీకి చెందిన నిందితుడు పంజాల జైహింద్ గౌడ్ (63) తన అనుచరుడు రాజా లింగారెడ్డితో కలిసి రాంపల్లిలోని సర్వే నంబర్ 268, బ్లాక్ ‘E’ పరిధిలో ఉన్న 10 ఎకరాల 08 గుంటల భూమికి సంబంధించి కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడు
సదరు భూమికి సంబంధించి రిజిస్టర్డ్ సేల్ డీడ్ పొందిన అనంతరం, ఆ భూమిని రతన్ లాల్, ముఖేష్ అగర్వాల్‌లకు విక్రయించాడు. అయితే, ఆ భూమిపై ఇప్పటికే వివాదం ఉన్నట్లు తెలుసుకున్న కొనుగోలుదారులు భూమిని స్వీకరించడానికి నిరాకరించారు. అనంతరం వారితో సమస్యను పరిష్కరించి సేల్ డీడ్‌ను రద్దు చేశారు.
2026 సంవత్సరంలో పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడిపై పలు కేసులు నమోదు అయినట్లు తెలిపారు. భూమిపై ఉన్న వివాదం కారణంగా కొనుగోలుదారులు అభ్యంతరం వ్యక్తం చేసి సేల్ డీడ్‌ను రద్దు చేసినప్పటికీ, నిందితుడు ఆ వివాదాస్పద భూమిలో అనధికారికంగా లేఅవుట్ ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అనంతరం తన ఏజెంట్ల ద్వారా ప్లాట్లను విక్రయిస్తూ, వాటికి ఎలాంటి న్యాయపరమైన సమస్యలు లేవని కొనుగోలుదారులకు హామీ ఇచ్చి పలువురు అమాయక ప్రజలను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడి కార్యకలాపాల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి పీడీ చట్టాన్ని ప్రయోగించి చర్లపల్లి జైలుకు తరలించారు.