చేవెళ్లలో పట్టుబడ్డ గంజాయి

15-11-2026 | 12:01am

- కారులో 22 కిలోల గంజాయి పట్టివేత

- ఇద్దరిని అదుపులోకి తీసుకున్న చేవెళ్ల పోలీసులు

- విజయవాడ నుంచి మహారాష్ట్రకు అక్రమ రవాణా

చేవెళ్ల, నవంబర్ 14 (విజయక్రాంతి): చేవెళ్ల పోలీస్ స్టేషన్(Chevella Police Station) పరిధిలోని ఫరా కాలేజీ(Farah College) సమీపంలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. AP 39 WW 6222 నంబర్ గల కారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 22 కిలోల గంజాయిని(Cannabis) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు వాహన తనిఖీలు(Vehicle Inspections) చేయగా గంజాయి బయటపడింది.

కారులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన నక్క నారాయణ (30), రాణిమేకల నాగరాజు (29)లను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో విజయవాడ నుంచి మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు నిందితులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు నక్క నారాయణపై గతంలోనూ ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా డొంకరాయి పోలీస్ స్టేషన్‌లో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి కేసు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.

గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ అక్రమ రవాణా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు సహకరించాలని కోరారు.

మరిన్ని వార్తలు