మొద్దు నిద్రలో నిజాంపేట్ టౌన్ ప్లానింగ్ వ్యవస్థ..
- అనుమతులు లేని భారీ అక్రమ షెడ్డు
- ఫిర్యాదులు చేసిన పట్టింపు లేని టౌన్ ప్లానింగ్ అధికారులు...
- ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి దొడ్డిదారిలో ఎడా పెడా నిర్మాణాలు...
- సెటిల్మెంట్ల వేటలో కొనసాగుతూ... విధులను గాలికొదిలేసి చోద్యం చూస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు...
కుత్బుల్లాపూర్, నవంబర్ 16 (విజయక్రాంతి): సిఎంసి పరిధి నిజాంపేట్(Nizampet) సర్కిల్ లో టౌన్ ప్లానింగ్ వ్యవస్థ నిద్రావస్థలో కొనసాగుతుంది. అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేని షెడ్ల నిర్మాణాలతో మూడు పువ్వులు ఆరు కాయలుగా అక్రమార్కులు, కొందరు దళారులు నిజాంపేట్ సర్కిల్ లో అక్రమాల వేట కొనసాగిస్తుంటే, సంబంధిత టౌన్ ప్లానింగ్ వ్యవస్థ ముడుపుల వేటలో కొనసాగుతూ వాళ్ళతో చేతులు కలిపి వారికీ సలాం కొడుతున్నారు.
నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని నిజాంపేట్ నుండి బాచుపల్లి వెళ్లే రహదారిలో విజ్ఞాన్ స్కూల్ కి వెళ్లే దారిలో సర్వే నెంబర్ 332లోని స్మశాన వాటికిను ఆనుకొని ఉన్న స్థలంలో ఓ నిర్మాణదారుడు తన అతి తెలివి ప్రదర్శిస్తూ ఎటువంటి అనుమతులు లేకుండా భారీ అక్రమ షెడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నారు. అయితే అక్రమ షెడ్డు నిర్మాణంపై నిజాంపేట్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు పలు సార్లు పిర్యాదు చేసినా... వార్డు ఆఫీసర్ చోద్యం చూస్తూ పట్టించుకున్న దాఖలాలు లేవు.
ప్రభుత్వ అదాయానికి గండి కొడుతూ... ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ షెడ్డు చేపడుతున్నారని,షెడ్డు నిర్మాణం మొదలుకొని ఫిర్యాదులు చేసినా, షెడ్డు పూర్తి స్థాయిలో నిర్మాణం ముస్తాబయి చకా చకా పనులు సాగుతున్న అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు,కొందరు ఫిర్యాదుదారులు వాపోతున్నారు.
అక్రమ నిర్మాణాల వ్యవహారంలో అధికారులు విధులను గాలికొదిలేసి అక్రమార్కులతో చేతులు కలిపి ప్రభుత్వం దగ్గర జీత బత్యాలు సేకరించి, అటు అక్రమ దనార్జనతో జేబులు నింపుకొని అక్రమార్కులకు వంతు పాడుతున్నారని పలువురు వాపోతున్నారు.ఇకనైనా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఈ అక్రమ షెడ్డును కూల్చివేయాలని విధులపై తమ చిత్త శుద్ధిని చాటుకోవాలని స్థానికులు కోరుతున్నారు.