యువత సామాజిక సేవలో.. భాగస్వాములు కావాలి

16-11-2026 | 09:42pm
  1. వర్చువల్ గా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు
  2. స్వయంకృషి 35 ఏళ్ల సేవలు అభినందనీయం..

జవహర్ నగర్, నవంబర్ 16 (విజయక్రాంతి): యువత సామాజిక సేవలో భాగస్వాములు కావాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు(Former Vice President M. Venkaiah Naidu) పేర్కొన్నారు. మేధో వైకల్యం ఉన్నవారికి సమాజంలో సమాన గౌరవం, అవకాశాలు కల్పించేందుకు యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.

దేశ అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక, సాంకేతిక పురోగతి మాత్రమే కాదని, ప్రతి ఒక్కరినీ గౌరవిస్తూ అందరినీ కలుపుకుపోయే సమాజాన్ని నిర్మించడమే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు.సికింద్రాబాద్‌లో మేధో వైకల్యం ఉన్నవారి సంరక్షణ, విద్య, శిక్షణ, పునరావాసం కోసం 1991లో స్థాపించిన స్వయంకృషి సంస్థ 35వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు వర్చువల్‌గా హాజరై ప్రసంగించారు. మేధో వైకల్యం ఉన్నవారికి జాలి చూపడం కంటే, వారి సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహించడం, తగిన అవకాశాలు కల్పించడం ముఖ్యమన్నారు.స్వయంకృషి సంస్థ గత 35 ఏళ్లుగా వ్యక్తిగత విద్య, వృత్తి శిక్షణ, రోజువారీ పనులు స్వయంగా చేసుకునేలా ప్రత్యేక శిక్షణ అందిస్తూ ఎంతోమందిని స్వావలంబన దిశగా నడిపిస్తోందని కొనియాడారు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం ఉంటుందని, దాన్ని గుర్తించి అభివృద్ధి చేసేలా సంస్థ చేస్తున్న కృషి

అభినందనీయమన్నారు. సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ మంజులా కళ్యాణ్, సిబ్బంది, స్వచ్ఛంద సేవకులను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి సీతక్క స్వయంకృషి ప్రాంగణాన్ని సందర్శించి, విద్యార్థులు తయారుచేసిన వస్తువుల ప్రదర్శనను పరిశీలించారు. సంస్థ అందిస్తున్న సేవలను, మంజులా కళ్యాణ్ అంకితభావాన్ని ప్రశంసించారు. మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మంజులా కళ్యాణ్ సేవలను అభినందించి, ఆమెను భారతదేశానికి ఒక మూలస్తంభంగా అభివర్ణించారు.

సీనియర్ పాత్రికేయుడు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ రాజకీయాలు, నేర వార్తలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలకు కూడా పత్రికలు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. స్వయంకృషి వంటి సంస్థల సేవలను ప్రజలకు తెలియజేయడం ద్వారా మరిన్ని సేవా సంస్థలు ఏర్పడేందుకు ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు