అభిమానుల మధ్య ఈఎన్‌ఈ డే
జూబ్లీహిల్స్, నవంబర్ 14 (విజయాక్రాంతి): ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’(Ee Nagaraniki Emaindi) సినిమా ఎనిమిదేళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకుని ‘ఈఎన్‌ఈ డే’ వేడుకలను నిర్వహించారు. ‘ఈఎన్‌ఈ రిపీట్’ విడుదల నేపథ్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో దర్శకుడు తరుణ్ భాస్కర్‌తోపాటు(director Tharun Bhascker) చిత్రబృందం అభిమానులతో రోజంతా సందడి చేసింది. సాధారణ సినిమా ప్రచార కార్యక్రమాలకు భిన్నంగా వినూత్న రీతిలో ఈ వేడుకను నిర్వహించారు.
‘ఈఎన్‌ఈ గాట్ లేటెంట్’, ప్యానల్ చర్చలు, ‘ఉమెన్ ఇన్ సినిమా’ అంశంపై ప్రత్యేక సంభాషణలు, లఘుచిత్రాల ప్రదర్శన వంటి కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దర్శకుడు తరుణ్ భాస్కర్, నటీనటులు అభిమానులతో ముచ్చటిస్తూ సినిమా నిర్మాణ అనుభవాలను పంచుకున్నారు. 2018లో విడుదలైన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం స్నేహం, హాస్యం, సహజమైన సంభాషణలతో యువతకు విశేషంగా చేరువైంది.
కాలక్రమంలో కల్ట్ ఫిల్మ్‌గా గుర్తింపు పొందిన ఈ సినిమా మీమ్స్, రీ-వాచెస్, సోషల్ మీడియా చర్చల రూపంలో ఇప్పటికీ ప్రేక్షకుల ఆదరణను కొనసాగిస్తోంది. సినిమా బృందం, అభిమానుల మధ్య ఉన్న అనుబంధాన్ని వేడుకగా మలచడమే లక్ష్యంగా నిర్వహించిన ఈఎన్‌ఈ డే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేశ్ కాకుమాను, శివాత్మిక రాజశేఖర్, అనీషా అంబ్రోస్ నటించిన ‘ఈఎన్‌ఈ రిపీట్’ నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.