పిరుదుకుంటకు ఫీడర్ ఛానల్ ఏర్పాటు చేయాలి
కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన సర్పంచ్ ఆవుల సుందరయ్య యాదవ్.
చిట్యాల, నవంబర్ 16 (విజయ క్రాంతి): చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామ(Chinnakaparti village) పరిధిలోని 30 ఎకరాల విస్తీర్ణం కలిగిన పిరుదుకుంటకు పిలాయిపల్లి కాల్వ(Pillaipalli Canal) ద్వారా నీటిని మళ్లించేందుకు ఫీడర్ ఛానల్ ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ ఆవుల సుందరయ్య యాదవ్ కోరారు. సోమవారం నల్లగొండ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో గ్రామస్తులు, రైతులతో కలిసి జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పిరుదుకుంటను నీటితో నింపడం ద్వారా దిగువ ప్రాంతంలోని ఎర్రకుంట, పెద్దచెరువుతో పాటు బోయగుబ్బ, మొగిలిదొరి, తాళ్లవెల్లంల గ్రామాల రైతులకు సాగునీటి సమస్య తీరుతుందని తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఫీడర్ ఛానల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనిపై స్పందించిన అధికారులు నీరు చేరేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఆవుల మాధవి, వార్డు సభ్యులు పాకాల నరసింహ, పెర్క నాగరాజు, నాయకులు అందే రాములు, పల్లపు ప్రశాంత్, మెట్టు వెంకటేశం, ముక్కామల యాదయ్య, పెర్క కుమార్ తదితరులు పాల్గొన్నారు.