పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు
ఫిబ్రవరి 6న చీకటాయపాలెం నుంచి దేవరపెట్టె తరలింపు.. 7న దిష్టిపూజ
చివ్వెంల, నవంబర్ 16 (విజయక్రాంతి): చివ్వెంల మండలం దురాజిపల్లి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరను 2027 ఫిబ్రవరి 21 నుంచి 25వ తేదీ వరకు ఐదు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. జాతరలో భాగంగా ఫిబ్రవరి 6న చీకటాయపాలెం నుంచి దేవరపెట్టెను తరలించనుండగా, ఫిబ్రవరి 7వ తేదీ ఆదివారం రాత్రి 11 గంటలకు దిష్టిపూజ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 21న సూర్యాపేట మండలం కేసారం నుంచి దేవరపెట్టెను పెద్దగట్టుపైకి తీసుకురావడంతో పాటు గంపల ప్రదక్షిణ నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 22న బోనాల సమర్పణ, 23న చంద్రపట్నం వేయడం, 24న నెలవారం నిర్వహించి దేవరపెట్టెను తిరిగి కేసారానికి తరలిస్తారు. ఫిబ్రవరి 25న జాతర ముగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఐదు రోజులపాటు జరిగే ఈ మహాజాతరకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి లింగమంతుల స్వామిని దర్శించుకోనున్నారు. జాతరను సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో సంతోష్ రెడ్డి, మాజీ చైర్మన్లు పోలెబోయిన నర్సయ్య యాదవ్, వసంత సత్యనారాయణ పిళ్లె, గొర్ల వంశస్థులు గన్నారెడ్డి, మాజీ డైరెక్టర్లు, పూజారులు, యాదవ కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.