అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు
- పథకాల అమలుకు అర్హతే ప్రామాణికం
- కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల పద్మనాయక ఫంక్షన్ హాల్లో నూతనంగా మంజూరైన చేయూత ఆసరా పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, కమిషనర్ అన్వేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ బానేష్ లతో కలిసి హాజరై లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా, అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించి ప్రయోజనాలు అందించాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, దివ్యాంగులు, డయాలసిస్ రోగులు, ఫైలేరియా, తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వ్యాధిగ్రస్తులు తదితర అర్హులైన వర్గాలకు సంతృప్త స్థాయి ప్రాతిపదికన కొత్తగా ఆసరా పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 10 వేల మందికి పైగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని, మంజూరైన పెన్షన్లకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు డిసెంబర్ నుండి లబ్ధిదారులకు అందే అవకాశం ఉందని తెలిపారు.
పెన్షన్లకు సంబంధించి కొన్ని దరఖాస్తులను పరిశీలన నిమిత్తం పెండింగ్‌లో ఉంచడం జరిగిందని, దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి సదరం సర్టిఫికెట్ సమర్పించిన అనంతరం అర్హతను పరిశీలించి పెన్షన్ మంజూరుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైద్య మండలి మార్గదర్శకాల ప్రకారం 40 శాతం, అంతకంటే ఎక్కువ దివ్యాంగత్వం ఉన్నవారికి మాత్రమే సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారని తెలిపారు.
ప్రభుత్వం అందించే పెన్షన్‌తో పాటు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు, రైల్వే ప్రయాణ రాయితీలు తదితర ప్రయోజనాలు కూడా దివ్యాంగులకు వర్తిస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో అర్హత లేని వారు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించడం, దివ్యాంగత్వ శాతాన్ని మార్చేందుకు ప్రయత్నించడం చేయరాదని, గతంలో దివ్యాంగుల కోటాలో ఉద్యోగాలు పొందిన వారి ధ్రువపత్రాలను తిరిగి వైద్య పరీక్షల ద్వారా పరిశీలించగా, కొంతమందికి నిర్దేశిత దివ్యాంగత్వ శాతం లేదని గుర్తించడం జరిగిందని, తప్పుడు ధ్రువపత్రాల జారీకి బాధ్యులైన వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అర్హతే ప్రధాన ప్రామాణికమని, అర్హులైన వారికి తప్పనిసరిగా ప్రయోజనాలు అందేలా చూడాలని, అనర్హులకు ఎట్టి పరిస్థితులలోనూ పథకాలు మంజూరు చేయరాదని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తదితర పథకాల అమలులో కూడా ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, అర్హత ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నవారు సంబంధిత పథకాలకు అనర్హులవుతారని వివరించారు. అర్హత ఉన్నప్పటికీ ఏ కారణం చేతనైనా పెన్షన్, ఇతర సంక్షేమ పథకాలు అందని వారు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
అక్టోబర్ 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్హత సాధించేందుకు వయస్సు తదితర వివరాలలో తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ ప్రయోజనాలు కోల్పోవడమే కాకుండా, సంబంధిత వ్యక్తులు, ధ్రువీకరించిన అధికారులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని తెలిపారు. ప్రజలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తోందని, ఈ నెల 19వ తేదీ నుండి అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
రేషన్ కార్డులో నమోదైన 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తులకు ఈ పథకం ద్వారా 5 లక్షల రూపాయల బీమా రక్షణ కల్పించడం జరుగుతుందని, లబ్ధిదారులు తమ నామినీల వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని, ప్రజలకు సంక్షేమ పథకాల అమలులో ఎదురయ్యే సమస్యలను ప్రజాప్రతినిధులు తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనంతరం లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. మొత్తం 2,509 మంది లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేయగా, అందులో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2,261 మందికి, హాజీపూర్ మండల పరిధిలో 248 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.