187 రోజుల తర్వాత అంత్యక్రియలు
మణిపూర్: ఆరు నెలలకు పైగా కొనసాగిన ఎదురుచూపులకు తెరపడింది. మణిపూర్(Manipur)లో అపహరణకు గురై హత్యకు గురైన ఆరుగురు నాగ పౌరులకు(Naga Citizens) సోమవారం స్వగ్రామంలో అంత్యక్రియలు(Funeral) నిర్వహించారు. కాంగ్పోక్పి జిల్లాలోని కొన్సాఖుల్ గ్రామంలో జరిగిన అంతిమ సంస్కారాల సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
మే 13న లెయిలాన్ వైఫేయి ప్రాంతం నుంచి ఆరుగురు నాగ వ్యక్తులు అపహరణకు గురయ్యారు. దాదాపు నాలుగు వారాల తర్వాత జూన్ 10న వారి మృతదేహాలను భద్రతా బలగాలు గుర్తించాయి. అప్పటి నుంచి ఇంఫాల్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (JNIMS) మార్చురీలోనే మృతదేహాలు ఉన్నాయి.
కుటుంబాలు, నాగ సంఘాలు న్యాయం కోసం డిమాండ్ చేస్తూ మృతదేహాలను స్వీకరించకుండా ఎదురుచూశాయి. సెప్టెంబర్ 26న గువాహటిలో కేంద్ర హోంశాఖ, మణిపూర్ ప్రభుత్వం, యునైటెడ్ నాగ కౌన్సిల్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల అనంతరం అంత్యక్రియలకు మార్గం సుగమమైంది.
సోమవారం మృతదేహాలను స్వగ్రామానికి తరలించి నాగ అమరవీరుల పార్కులో అంత్యక్రియలు నిర్వహించారు. ఆరుగురికి కుటుంబ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు కన్నీటి వీడ్కోలు పలికారు. అయితే తమవారి అంత్యక్రియలు పూర్తయినా, హత్యకు బాధ్యులైన వారికి శిక్ష పడే వరకు న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామని బాధిత కుటుంబాలు స్పష్టం చేశాయి.