13-10-2025 12:00:00 AM
ఆదిలాబాద్, అక్టోబర్ 12 (విజయక్రాంతి) : మన బాస... మన యాస... అం టూ అచ్చమైన ఆదిలాబాద్ మాండలికంలో స్థానికతను కనబరిచే కార్యక్రమాల రూపకల్పనతో శ్రోతల మనస్సులకు దగ్గరవుతూ వస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం. ఈ కేంద్రం 1986 అక్టోబర్ 12 ప్రసారాలను ప్రారంభించింది. ఈ కేంద్రం ఉభయ తెలు గు రాష్ట్రాలలోనే అంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ మొదటి కేంద్రం కాగా, దేశం మొత్తంలోనే మూడవ స్థానిక రేడియో కేంద్రంగా నిలిచింది.
మొదట ఏఎం పద్దతిలో ఒక కిలో వాట్ సామర్ధ్యం ట్రాన్స్ మీటర్ తో ప్రసారాలను ప్రారంభించి, తర్వాతి కాలంలో మూ డు కిలోవాట్ల ప్రసార శక్తిని అందిపుచ్చుకున్నది. 15 ఆగస్టు 2015 నుండి ఎఫ్.ఎం. కేం ద్రంగా మారింది. ఆ తర్వాత కొద్ది రోజులకే మొబైల్ ఆప్ ప్లాట్ ఫాం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటనే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారాలను వినగలిగే వీలుకలిగింది.
గత సంవత్సరం జనవరి 26వ తేదీ నుండి పది కిలోవాట్ల సామర్థ్యంతో ప్రసారాలను వినిపిస్తోంది. ఎప్పటిక ప్పుడు అందివచ్చిన సాంకేతికతను అందిపుచ్చుకొని శ్రోతలకు నాణ్యమైన ప్రసారాలను అందజేస్తోంది. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయిన శ్రోత ల కోసం వాటిని ఆకాశవాణి యూ ట్యూబ్ చానల్ లో అందుబాటులో ఉంచుతున్నది.
యాస, బాసతోప్రత్యేక ప్రోగ్రాంల ప్రసారం..
ఆదిలాబాద్ యాస, బాస, మాట పలుకు లకు పట్టంకడుతోంది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం. ఇంకా ఇక్కడి సాంస్కృతిక, భాషాపరమైన వైవిధ్యాన్ని ఒడిసిపట్టుకొని ఇక్కడి జీవితాలు, అవసరాలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది. సృజనాత్మకతకు, అనుభవాలకు వ్యక్తీకరణను కల్పిస్తూ శ్రోతల మన స్సులకు నిండుగా దగ్గరవుతూ వస్తున్నది.
బుర్రకథ, ఒగ్గుకథ, బుడిగే జంగం కథ, చిం దు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి కథన ప్రక్రియల్లో సాగే జానపద, ప్రాచీన గాధలు, పాటలను వ్యాఖ్యాన సహితంగా ప్రసారం చేస్తూ ప్రజల జ్ఞాపకాలను పురికొల్పి, వాటి లోతైన అర్ధాల పట్ల గౌరవం పెరిగేలా నిరంతరం కృషి చేస్తోంది. వ్యవసాయం పట్ల ఎక్కువ శ్రద్ద చూపుతూ మేలైన వ్యవసాయ పద్దతుల గురించి కిసాన్ వాణి, ఇల్లూ యెవుసం కార్యక్రమాలలో అందిస్తున్నది.
మంచి దిగుబడులను సాధిస్తున్నరై తుల అనుభవాలను వారి పంటపొలాలోకే వెళ్ళి రికార్డ్ చేసి తీసుకువచ్చి రైతు అంతరంగం శీర్షికన ప్రసారం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో జరిగే పండుగలు, వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన నివేది కలను రూపొందించి ప్రసారం చేస్తూ శ్రోతలకు వాటి విశిష్టతలను, గొప్పతనాన్ని తెలి యజేస్తోంది.
చిన్నపిల్లలు, యువకులు, మహిళలు ఇలా అన్ని వర్గాలు, అన్ని వయసుల వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తోంది. విద్యా, వైద్యం, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా ప్రసారం చేస్తోంది. శాస్త్రీయ, జానపద సంగీతం, సాహిత్య అభిమానుల కోసం జానపద గీతాలు, కథాగా నాలు, నవలా, పుస్తక సాహిత్యాన్ని, కథా సాహిత్యాన్ని అందిస్తోంది.
లలిత వాద్య సంగీతంతోపాటు సినీ సంగీతాన్ని కూడా వినిపిస్తోంది. మొత్తం మీద స్థానికతను కనబరిచే కార్యక్రమాల రూపకల్పనతో ముందు కు సాగుతున్నది. అచ్చమైన ఆదిలాబాద్, తెలంగాణ మాండలికంలో కలివిడిగా, కలుపుగోలుగా సాగుతున్నది. ఇలా పూర్తిస్థాయి లో పనిచేస్తున్న రేడియో కేంద్రం రాష్ట్రంలో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు.
స్థానికతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ప్రోగ్రాంల నిర్వహణ
స్థానిక యాస, భాస, సంస్కృతికి ప్రాధాన్యతనిస్తూ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రముఖుల అభిప్రాయాలతో శ్రోతలకు మరింతగా దగ్గరవుతున్నాం. స్థానికంగా ఉండే పండగలు, ఆదివాసీల సంస్కృతి ఉట్టిపడేలా ప్రోగ్రాంల నిర్వాహక రూపక ల్పన చేస్తున్నాం. మహిళా, యువత, రైతులు ఇలా అన్ని వర్గాల మనసులను హత్తుకునేలా అధునాతన సాంకేతికను ఉపయోగిస్తూ వివిధ కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాం.
కేంద్రీ రామేశ్వర్, ఆకాశవాణి కేంద్రం ప్రోగ్రాం హెడ్