మహిళలపై కనిపించని దోపిడి పింక్ టాక్స్

16-04-2024 05:56:43 PM

అందంగా కనిపించడం కూడా ఒక క్వాలిఫికేషన్ అయిన రోజులివి. హోటల్ రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి టీవీలో న్యూస్ ప్రజెంటర్ వరకూ అందంగా కనిపించటం ఒక అవసరం. కురుల దగ్గర నుంచి కాలిగోళ్ల వరకూ తీర్చి దిద్దుకోవటం ఉద్యోగంలో ఒక భాగమైపోయింది. కానీ అదే అందం ఇప్పుడు భారమైంది. పింక్ టాక్స్ పేరుతో మహిళల సౌందర్య సాధానాల మీద వసూలు చేస్తున్న టాక్స్ కిందిస్థాయి ఉద్యోగాల్లో ఉన్న మహిళలకు అదనపు భారంగా మారబోతోంది. ఇంతకీ  ఏమిటీ పింక్ టాక్స్? దీని వల్ల ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుందో తెలుసుకుందాం?!

ఇన్‌కమ్ టాక్స్ గురించి విన్నాం, సర్వీస్ టాక్స్ గురించి విన్నాం. చివరకు మనం కొనే వస్తువులకు కట్టే జీఎస్టీ గురించి కూడా తెలుసు కానీ ఈ పింక్ టాక్స్ ఏంటీ అంటూ ఆశ్చర్యపోతున్నారా. నిజమే చాలా మందికి దీని గురించి తెలిసుండక పోవచ్చు. కొద్దిరోజులుగా పింక్ టాక్స్ అనే పదం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.  ఐదారేళ్ల క్రితం ఈ పింక్ టాక్స్ గురించి చర్చ జరిగినా ఎందుకో దాని గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ ఉన్నట్లుండి గత వారం రోజులుగా దీని గురించి విస్తృతంగా సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.. మహిళలపైనే ఇది ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుందని మహిళా ఉద్యమకారులు, ఆర్థిక నిఫుణులు చర్చిస్తున్నారు.

జీఎస్టీ అమలు దాని సత్పలితాలు ఎలా ఉన్నాయో చర్చించ వచ్చు కానీ ఒకే వస్తువును కొన్ని పురుష వినియోగదారుడితో పోల్చితే మహిళలు రెట్టింపు స్థాయిలో పన్నులు చెల్లించాల్సి వస్తుందని ఎంతమందికి తెలుసు. ప్రొడక్ట్ విషయంలో మహిళలు వాడే వస్తువులకు, పురుషులు వాడే వాటికి తేడాలు ఉంటాయని తెలుసు కానీ వాటికి కట్టే పన్నులు విషయంలో కూడా తేడాలు ఉండాయని ఈమధ్యే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అదే “పింక్ టాక్స్‌” అనే పేరుతో మహిళలపై భారంగా మారుతున్న వస్తుపన్నుల విధానం

జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్!

ఈ క్రమంలోనే అసలు పింక్ టాక్స్ అనే పదం గురించి మరోసారి చర్చ మొదలైంది. జీఎస్టీ తెలుసు.. సర్వీస్ టాక్స్.. ఇన్కంటాక్స్ తెలుసు.. ఈ పింక్ టాక్స్ ఏంటని అందరికీ డౌట్ రావొచ్చు. ఇది ప్రభుత్వం విధించే టాక్స్ మాత్రం కానే కాదు. పింక్ టాక్స్ అంటే.. పురుషులు, మహిళలు వినియోగించే ధరల మధ్య తేడా అని చెప్పొచ్చు. అంటే పురుషులతో పోల్చితే మహిళలు ఎక్కువగా చెల్లించే రుసుము.  చా లా కంపెనీలు ఈ పింక్ టాక్స్ విధిస్తుంటాయి. చాలా మందికి దీని గురించి అవగాహన ఉండకపోవచ్చు. అన్ని ప్రొడక్ట్స్‌పై పింక్ టాక్స్ ఉండదు. ఎక్కువగా సబ్బులు, లోషన్ క్రీమ్స్, డియోడరెంట్, బట్టలు ఈ లిస్టులో ఉన్నాయి. ఇదొక జెండర్ బేస్డ్ ప్రైజ్ డిస్క్రిమినేషన్ అని చెప్పొచ్చు.

అసలు పింక్ టాక్స్ ఏంటి! 

దీని గురించి గతంలో ఎన్నో కథనాలు వచ్చినా.. ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతోంది. దీనికి సంబంధించి ఒక వీడియోను ప్రముఖ మీడియా కంపెనీ అయిన సేల్స్ ఇండియా చీఫ్ సంజయ్ ఆరోరా తన ట్విట్టర్లో పోస్టు చేయగా సోషల్ మీడియాలో అది వైరల్‌గా మారింది. దానిని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అండ్ ఫౌండర్ కిరణ్ మజుందార్ షా. పింక్ టాక్స్ అంటే.. ఒకే కేటగిరీకి చెందిన ఒకే క్వాంటిటీలో ఉన్న ప్రొడక్ట్స్‌పై పురుషుల కంటే మహిళలు ఎక్కువ చెల్లించాలని ఆ వీడియోలో ఉండగా.. పురుషుల ప్రొడక్ట్స్  కంటే మహిళలు ఉపయోగించే ప్రొడక్ట్స్ ధరలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయని ఆమె ప్రశ్నించారు. అలాంటి వస్తువుల్ని కొనుగోలు చేయొద్దని.. లింగ వివక్షకు వ్యతిరేకంగా అంతా కలిసికట్టుగా ఉండాలని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.

  పన్ను రద్దు చేసిన దేశాలు!

సేమ్ ప్రొడక్ట్, సేమ్ క్వాంటిటీ ఉన్నా పురుషుల కంటే మహిళలు ఎక్కువగా చెల్లించాలి. దీని కోసం కొన్ని ఉదాహరణలు చూద్దాం. ప్రముఖ కంపెనీకి చెందిన 4.8 గ్రాముల లిప్ బామ్ ఉందనుకుందాం. ఇది ఒకే కంపెనీ, ఒకే సైజ్‌లో ఉన్నప్పటికీ.. ఇక్కడ పురుషులు రూ. 165 చెల్లిస్తే..  మహిళలు రూ. 250 కట్టాల్సి వస్తుంది. అంటే మహిళలు 51.5% ఎక్కువ చెల్లించాలి. ప్లెయిన్ రేజర్ విషయానికి వస్తే.. మహిళలు రూ. 115 చెల్లించాలి.  కొన్ని సందర్భాల్లో మహిళల కోసం స్పెషల్‌గా డిజైన్, ప్యాకేజీ చేసిన ఉత్పత్తులకు మాత్రమే వర్చించే ఎవరికీ కనిపించని పన్ను ఈ పింక్ టాక్స్ అని చెబుతున్నారు యుకే బేస్డ్ ఆర్థిక వేత్తలు.  మహిళలు, పురుషుల కోసం తయారయ్యే ఒకే రకమైన వస్తువులు మార్కెట్లోకి వచ్చేసరికి ధరల్లో అత్యధిక వ్యత్యాసం ఉందని పలు సర్వేల్లో వెల్లడైంది.

ఇక సెలూన్లలో పురుషుల హెయిర్ కట్‌కు అయ్యే ఖర్చు కంటే మహిళల హెయిర్ కట్‌కు చాలా ఎక్కువే అవుతుంది. యుకేలోని ఒక ప్రభుత్వ పరిశోధన దాదాపు 100 బ్రాండ్ల నుండి 80 లింగ-నిర్దిష్ట అంశాలను పరిశీలించింది. అధ్యయనం ప్రకారం, పురుషులతో పోల్చదగిన వస్తువుల కంటే మహిళలకు విక్రయించబడే ఇలాంటి వ్యక్తిగత సంరక్షణ వస్తువులు సగటున 13% ఖరీదైనవని గుర్తించింది.  స్త్రీల సానిటరీ వస్తువులపై విధించే పన్నులు మహిళలపై, ప్రత్యేకించి తక్కువ ఆదాయం ఉన్నవారిపై విధించే భారాన్ని గుర్తించి, న్యాయవాదులు ఈ లెవీలను తగ్గించడానికి లేదా తొలగించడానికి చాలా కాలంగా పోరాడుతున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, రువాండాతో సహా అనేక దేశాలు మహిళాలు ఉపయోగించే వస్తువులపై పన్నులను రద్దు చేశాయి కూడా.

నూతన ఆర్థిక విధానాల్లో భాగమే!

ఆడవాళ్లని భోగ వస్తువులుగా చేసే క్రమంలో వచ్చినవే ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా.  ఫలానా కొలతల్లోనే ఉండాలి, తెల్లగా వుండాలి, సన్నగా వుండాలని అంటూ ఈ ప్రోడక్ట్స్ ఉదరగోడుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే గత ముప్పు ఏళ్లుగా నగరాలతో మొదలూ మారుమూల పల్లెల వరకూ బ్యూటీ పార్లర్లు వెలిశాయి. మాల్స్ వెలిశాయి. వీటి వెంట యువతులు, మహిళలు పరిగెత్తేలా చేశాయి మార్కెట్ శక్తలు. ఇప్పడు ఆ వస్తువుల పైన అమాంతండా రేట్లు పెంచేస్తున్నారు. ఇవన్నీ న్యూ ఎకనామి పాలసీలో భాగంగా వచ్చిన ప్రైవేటీకరణ, సరళీకరణ, మర్కెటీకరణలో భాగంగా జరుగుతున్న కుట్రలుగానే వీటిని చూడాలి. 

ఇప్పటికే వస్తువు సేవల పన్నులు ద్వారా అదే వస్తువును పేద వాడు కొన్న, ధనవంతుడు కొన్నా ఒకే టాక్స్ పడుతుంది. కానీ పేదవాళ్లు ఉపయోగించే 480 వస్తువుల మీద 18 శాతం నుండి 28 వరకూ జీఎస్టీ వేయడం మూలంగా మొత్తం రాబడితో వీళ్ల ద్వారానే 72 శాతం వస్తుంది. అంటే 22 శాతం పన్నులను పేద, మధ్యతరగతి వర్గం ప్రజల ద్వారానే రాబడుతున్నారు. విరుద్ధంగా ధనవంతులు, అప్పర్ మిడిల్ క్లాస్ కొనే బంగారు, వ్రజాలు వంటి వాటిపైన కేవలం 3 శాతం టాక్స్ విధించారు. చివరకు చిన్నపిల్లలు వాడే పెన్సిల్లు, రబ్బర్లపైన కూడా 18 శాతానికి పైగా టాక్సీ విధిస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ వర్గాల ప్రజలపై భారం మోపుతున్నారో.

ఎలా బయటపడాలి?

పింక్ టాక్స్ నుంచి బయటపడాలంటే వీటికి బదులుగా సాధారణంగా ఉండే వస్తువుల్ని కొనుగోలు చేయడం ఉత్తమమని  చెబుతున్నారు వీటిపై పరిశోధన చేసిన నిపుణులు. ప్రత్యేకించి ప్రయోజనాల్లో పెద్దగా తేడా లేనప్పుడు.. వస్తువుల్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. పెర్ఫ్యూమ్స్, బ్యాగులు, రేజర్లు, దుస్తులు వంటివి కొనే సమయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

వీటన్నిటికీ పరిష్కారం ప్రయివేట్ సెక్టర్  బలోపేతం కావడమే. ప్రభుత్వ రంగంలో స్త్రీ, పురుష వివక్ష అనేది వేతనాల వ్యత్యాసాల్లో వుండదు. అందుకే బేసీక్ సమస్యలకు పరిష్కారం వెతక్కుండా వీటిపై దృష్టి సారించినా పెద్దగా ఉపయోగం ఉండదు.

 జ్యోతిరాణి, 

అర్థిక శాస్త్ర అధ్యాపకురాలు,

కాకతీయ విశ్వవిద్యాలయం