ప్రవేశ పరీక్షలకు వేళాయే!

24-04-2024 01:56:18 AM

మే నుంచి జూన్ వరకు వివిధ సెట్స్ నిర్వహణ

టీఎస్ సెట్స్‌కు భారీగా వస్తున్న దరఖాస్తులు

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): 2024 విద్యాసంవత్సరంలో అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలకు వేళయ్యింది. వచ్చే నెల నుంచి వరుసగా పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఇంటర్, పదో తరగతి పరీక్షలు ముగిశాయి. ఇంటర్, డిగ్రీ కోర్సులు పూర్తయిన విద్యార్థులు పైతరగతుల్లో చేరేందుకు నిర్వహించే ఈ పరీక్షలు మే, జూన్ నెలల్లో జరగనున్నాయి. దీంతో తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు పరీక్షల నిర్వహణకు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు.

మే 6న టీఎస్ ఈసెట్ పరీక్షతో ప్రారంభమై జూన్‌లో పీజీఈసెట్‌తో సెట్స్ ముగుస్తాయి. కీలకమైన టీఎస్ ఎప్‌సెట్ (గతంలో ఎంసెట్) పరీక్షలు మే 7 నుంచి 11 వరకు జరగనున్నాయి. ఇంజనీరింగ్, లా, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ అన్ని రకాల కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు ఈ రెండు నెలల్లోనే జరగనున్నాయి. ఈ ప్రవేశ పరీక్షల నిర్వహణ తర్వాత ఫలితాలు విడుదల చేసి జూన్, జూలైలో కౌన్సిలింగ్ ద్వారా సీట్ల భర్తీ ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు. 

ఎప్‌సెట్‌కు భారీగా దరఖాస్తులు..

ఎప్‌సెట్‌కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. నిరుటితో పోలిస్తే ఇంజినీరింగ్ విభాగానికి ఈసారి 50 వేల దరఖాస్తులు అధికంగా వచ్చాయి. గతేడాది ఇంజనీరింగ్‌కు 2,05,351 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 2,54,051 అప్లికేషన్లు వచ్చాయి. ఫార్మసీలో గతేడాదిలో 1,15,332 దరఖాస్తులు వస్తే, ఇప్పటివరకు 99,831 వచ్చాయి. దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉండడంతో దరఖాస్తుల సంఖ్య పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రవేశ పరీక్షలకు వచ్చిన దరఖాస్తులు..

ప్రవేశ పరీక్ష దరఖాస్తులు తుదిగడువు పరీక్షాతేదీలు

టీఎస్ ఈసెట్ 24,116 28 మే 6

ఎప్‌సెట్(బైపీసీ) 99,831 1 మే 7, 8

(ఎంపీసీ) 2,54,051 1 మే 9, 10, 11

ఎడ్‌సెట్ 17,666 13 మే 23

ఐసెట్ 41,801 27 జూన్ 5, 6

లాసెట్ 38,161 25 జూన్ 3

పీజీఈసెట్ 7,141 25 జూన్ 6 నుంచి 9 వరకు